Ibrahimpatnam: రేపు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముట్టడి మాజీ ఎమ్మెల్య
Ibrahimpatnam:కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ‘ఏకో టౌన్’ (డంపింగ్ యార్డ్) ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జూన్ 29న కలెక్టరేట్ ముట్టడికి మాజీ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు
Ibrahimpatnam: రేపు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముట్టడి మాజీ ఎమ్మెల్య
ఇబ్రహీంపట్నం: నియోజకవర్గ పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, బండరావిరాల గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 268 లో గల 494 ఎకరాల ప్రభుత్వ భూమిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయ తలపెట్టిన ‘ఏకో టౌన్’ (డంపింగ్ యార్డ్) ప్రాజెక్టును బిఆర్‌ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఇబ్రహీంపట్నం మాజీ శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ ప్రాజెక్టుకు నిరసనగా ఈ నెల 29 వ తేదీ సోమవారం నాడు నిర్వహించ తలపెట్టిన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి మద్దతు కోరుతూ బండరావిరాల గ్రామ సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్ మరియు బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి తాము పూర్తి స్థాయిలో అండగా ఉంటామని మంచిరెడ్డి కిషన్ రెడ్డి వారికి భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, జవహర్‌నగర్ తరహాలో అత్యంత ప్రమాదకరమైన చెత్త డంపింగ్ యార్డ్‌ను ఇక్కడికి తీసుకువచ్చి ఏకో టౌన్ పేరిట బండరావిరాల, చిన్నరావిరాల, పిల్లాయపల్లి, బాచారం, గౌరెల్లి, సద్దిపల్లి, తారమతిపేట, కావాడిపల్లి, బలిజగూడ వంటి దాదాపు 15 గ్రామాల పర్యావరణాన్ని పూర్తిగా కలుషితం చేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మండిపడ్డారు.
ఇక్కడ అందుబాటులో ఉన్న వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిలో ఐటీ, సాఫ్ట్‌వేర్ లేదా హార్డ్‌వేర్ కంపెనీలను ఏర్పాటు చేస్తే స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించి ఈ ప్రాంతం ఆర్థికంగా బాగుపడుతుందని హితవు పలికారు. అలా కాకుండా ప్రజల ఆరోగ్యాలను పణంగా పెడుతూ, పర్యావరణాన్ని ధ్వంసం చేసే చెత్త యార్డులను తీసుకురావడం వెనుక కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం లాలుచీ పడ్డారని ఆయన తీవ్రంగా ఆరోపించారు.
ఇప్పటికే మూసీ ప్రాజెక్ట్ పునరుద్ధరణ పేరుతో మర్రిపల్లి, కుత్బుల్లాపూర్, బాచారం వంటి గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఇప్పుడు ఏకో టౌన్ పేరుతో మరికొన్ని గ్రామాలను ఖాళీ చేయించే పరిస్థితి తీసుకురావడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని విరమించుకోవాలని, జనావాసాలకు దూరంగా ఉన్న అటవీ ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ తుగ్లక్ చర్యలకు నిరసనగా సోమవారం ఉదయం బిఆర్‌ఎస్, బిఎస్‌పి మరియు ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. బండరావిరాల పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలు, యువకులు, మహిళలతో పాటు పొరుగున ఉన్న నల్గొండ జిల్లా సరిహద్దు గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంచిరెడ్డి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ అబ్దుల్లాపూర్ మెట్ మండల అధ్యక్షులు కొత్త కిషన్ గౌడ్ , బండరావిరాల గ్రామ సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్, సీనియర్ నాయకులు మొలుగు దానేశ్, కావాడి దయాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ దూస శంకర్ ముదిరాజ్, వార్డు సభ్యులు కందికంటి అనూష - ప్రవీణ్, కన్నె భరత్ యాదవ్ మరియు యువ నాయకులు ఏమ్ముల శివ శంకర్ మరియు కొత్త శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు.




