Hyderabad: రోస్టర్‌లో తేడా వస్తే రేవంత్ సర్కార్‌తో యుద్ధమే: మందకృష్ణ మాదిగ!
Hyderabad: ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్లలో తేడాలొస్తే రేవంత్ సర్కార్‌తో యుద్ధమేనని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు.
Hyderabad: రోస్టర్‌లో తేడా వస్తే రేవంత్ సర్కార్‌తో యుద్ధమే: మందకృష్ణ మాదిగ!
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ చట్టంలో రోస్టర్ పాయింట్లను సవరించే పేరుతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కుట్రలకు పాల్పడితే మాదిగ విద్యార్థులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. రోస్టర్‌లో తేడా వస్తే రేవంత్ సర్కార్‌తో తాడోపేడో తేల్చుకునేందుకు యుద్ధానికి సిద్ధమవుతామని అన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎదుట డా. చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగ అధ్యక్షతన నిర్వహించిన మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్‌ఎఫ్) ప్రతినిధుల జాతీయ సదస్సులో మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చిన సమయంలోనే మాదిగలకు జనాభా ప్రాతిపదికన తగిన వాటా దక్కలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి స్పష్టం చేశామని తెలిపారు.
2026 జనాభా లెక్కల అనంతరం ఎస్సీ రిజర్వేషన్లను పెంచి, జనాభా నిష్పత్తి ప్రకారం అన్ని కులాలకు రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్, మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి, అనంతరం వర్గీకరణ చట్టం తీసుకురావడంతో ప్రక్రియ పూర్తయిందని అన్నారు. ఇప్పుడు రోస్టర్ సవరణ పేరుతో మళ్లీ మార్పులు చేయడం సరికాదన్నారు.
ఎస్సీ వర్గీకరణలో న్యాయమైన వాటా దక్కక నష్టపోయింది మాదిగలేనని పేర్కొన్నారు. ఎస్సీ రిజర్వేషన్లను పెంచి వర్గీకరణ ప్రకారం మాదిగలకు 14 శాతం వాటా కల్పించాలని డిమాండ్ చేశారు. మాలల పట్ల ఎమ్మార్పీఎస్ సోదరత్వం, మానవత్వంతో వ్యవహరిస్తుందని, కుల వివక్ష నిర్మూలన, సామాజిక న్యాయం కోసం మాలలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.
సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలను నిర్మూలించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రకులాల్లోని పేదలను కలుపుకొని భవిష్యత్తు ఉద్యమాలను నిర్మించాలని అన్నారు. ఎస్సీ వర్గీకరణ సాధన కోసం జరిగిన ఉద్యమంలో ఎంఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో మాదిగ విద్యార్థులు పోషించిన పాత్ర చారిత్రాత్మకమని కొనియాడారు. కుల, మత, లింగ వివక్షలకు వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడాలని పిలుపునిచ్చారు.
విద్యారంగంపై పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడంతో సమస్యలు పరిష్కారం కావడం లేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద విద్యార్థులకు ఉన్నత విద్య భారంగా మారిందన్నారు. సంక్షేమ హాస్టళ్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.
విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్‌లో 15 శాతం కేటాయించాలని, విద్యారంగం, సంక్షేమ హాస్టళ్ల సమస్యల పరిష్కారం కోసం మార్చిలో ‘చలో హైదరాబాద్’ కార్యక్రమం నిర్వహిస్తామని మందకృష్ణ మాదిగ ప్రకటించారు. భవిష్యత్తులో ఎంఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో అన్ని వర్గాల విద్యార్థులను కలుపుకొని విద్యారంగ, సామాజిక సమస్యలపై ఉద్యమాలు చేపడతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సందే కార్తీక్ మాదిగ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బెనర్జీ మాదిగ, మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగ, డా. పల్లెర్ల సుధాకర్ మాదిగ, దుబ్బ కల్పన మాదిగ, కీర్తన మాదిగ, అనిల్ మాదిగ, బిక్కి మురళీకృష్ణ మాదిగ, పరశురాములు మాదిగ, బైరపోగు శివకుమార్ మాదిగ, ముక్కెర ముకేష్ మాదిగ, జనపాల మహేష్ మాదిగ, ఓయూ అధ్యక్షుడు మధుసూదన్ మాదిగ, దావు ఆదిత్య మాదిగ, రాజీవ్ ప్రదీప్ మాదిగ, మంద అనిల్ మాదిగతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంఎస్‌ఎఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు.




