Uppal: రామంతాపూర్‌లో ఘోర అగ్నిప్రమాదం.. స్క్రాప్ దుకాణ యజమానికి తీవ్ర గాయాలు!
Uppal: హైదరాబాద్ ఉప్పల్ పరిధి రామంతాపూర్ చర్చి కాలనీలోని స్క్రాప్ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది.
Uppal: రామంతాపూర్‌లో ఘోర అగ్నిప్రమాదం.. స్క్రాప్ దుకాణ యజమానికి తీవ్ర గాయాలు!
Uppal: హైదరాబాద్‌లోని ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధి రామంతాపూర్ చర్చి కాలనీలో స్క్రాప్ దుకాణంలో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దుకాణంలో లోహాన్ని కట్ చేస్తుండగా మంటలు చెలరేగడంతో యజమాని తథిరి పరశురాం (43) తీవ్రంగా గాయపడ్డారు. ఆయన శరీరం సుమారు 50 శాతం కాలినట్లు సమాచారం.
పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. రామంతాపూర్ చర్చి కాలనీలోని తన సొంత జీ+2 భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో పరశురాం స్క్రాప్ దుకాణం నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం సుమారు 11.15 గంటల సమయంలో ఆయన దుకాణంలో లోహాన్ని కట్ చేస్తుండగా మంటలు చెలరేగాయి.
దుకాణంలో ఫోమ్ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించి ఎగిసిపడ్డాయి. ఈ క్రమంలో పరశురాం తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు ఆయనను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. మొదట ఎల్బీనగర్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడ చికిత్స అందించేందుకు నిరాకరించినట్లు సమాచారం.
అనంతరం కాంచన్ బాగ్ అపోలో ఆసుపత్రికి తరలించగా, కేసును తీసుకోకపోవడంతో అక్కడి నుంచి డీఆర్‌డీవో ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. హైడ్రా, అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. స్థానిక ఉప్పల్ ఇన్స్పెక్టర్ రామలింగా రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ మధు, అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అగ్నిప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.




