Medak: కరెంట్ కోతలతో అల్లాడుతున్న నర్సాపూర్ రైతులు!
Medak: మెదక్ జిల్లా నర్సాపూర్‌లో విద్యుత్ కోతలతో రైతుల ఇబ్బందులు. పంటల రక్షణ కోసం ట్రాక్టర్లు, జనరేటర్ల సాయంతో డీజిల్ ఖర్చు పెట్టి నీరు పారిస్తున్న వైనం.
Medak: కరెంట్ కోతలతో అల్లాడుతున్న నర్సాపూర్ రైతులు!
Medak: పంటలు చేతికొచ్చే సమయంలో విద్యుత్ కోతలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వరి పొలాలకు సరిపడా విద్యుత్ సరఫరా లేకపోవడంతో కొందరు రైతులు సబ్‌స్టేషన్లను ముట్టడిస్తూ ఆందోళనకు దిగుతుండగా.. మరికొందరు రైతులు మాత్రం తమ పంటలను కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయిస్తున్నారు. ట్రాక్టర్లకు మోటార్లు బిగించి, జనరేటర్ల సాయంతో బోర్లు, బావుల నుంచి పొలాలకు నీటిని తరలిస్తున్నారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రాంతంలో విద్యుత్ కోతల ప్రభావం వరి పంటలపై తీవ్రంగా పడుతోంది. ఇప్పటికే ఎండలు మండిపోతుండటంతో పంటలకు నిరంతరం నీరు అవసరమైన పరిస్థితి నెలకొంది. అయితే విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పొలాలకు నీరు అందక వరి పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాలుగు ఎకరాల పంట కోసం.. ట్రాక్టర్‌తో నీటి తిప్పలు
నర్సాపూర్‌కు చెందిన రైతు శ్రీపాల్ నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశాడు. పంటకు అవసరమైన సమయంలో విద్యుత్ సరిగా అందకపోవడంతో బావి నుంచి పొలానికి నీరు పారబెట్టేందుకు ట్రాక్టర్‌కు మిషన్ బిగించాల్సి వచ్చింది. ట్రాక్టర్ సాయంతో బావి నుంచి నీటిని తోడి వరి పొలానికి పారబెడుతున్నాడు.
కరెంట్‌పై ఆధారపడితే పంట ఎండిపోయే పరిస్థితి ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ విధానాన్ని ఆశ్రయిస్తున్నానని రైతు శ్రీపాల్ చెబుతున్నారు. అయితే ట్రాక్టర్ వినియోగంతో అదనపు ఖర్చు భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం మూడు రోజులకు ట్రాక్టర్ డీజిల్‌కే సుమారు రూ.2 వేల వరకు ఖర్చవుతోందని తెలిపారు.
ఐదు ఎకరాలు ఎండిపోయాయి.. మిగిలిన పంటనైనా కాపాడుకునేందుకు జనరేటర్
ఇక నర్సాపూర్ మండలం మాడాపూర్ గ్రామానికి చెందిన రైతు ఖదీర్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఖదీర్ సుమారు 10 ఎకరాల్లో వరి నాట్లు వేశారు. అయితే కరెంట్ సక్రమంగా లేకపోవడంతో పంటకు అవసరమైన సమయంలో నీరు అందలేదు. దీంతో ఇప్పటికే సుమారు ఐదు ఎకరాల వరి పంట ఎండిపోయిందని రైతు చెబుతున్నారు.
మిగిలిన ఐదు ఎకరాల పంటనైనా కాపాడుకోవాలనే ఉద్దేశంతో బోర్‌కు జనరేటర్ కనెక్షన్ ఇచ్చి పొలానికి నీరు పారబెడుతున్నాడు. జనరేటర్ కిరాయి, డీజిల్ ఖర్చు కలిపి రోజుకు సుమారు రూ.1,500 వరకు అదనపు భారం పడుతోందని రైతు ఖదీర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కరెంట్ కోసం రైతుల ఆందోళన.. పంటల కోసం రైతుల పోరాటం
ఒకవైపు విద్యుత్ సరఫరా కోసం రైతులు సబ్‌స్టేషన్లను ముట్టడిస్తూ ఆందోళనలకు దిగుతుండగా.. మరోవైపు విద్యుత్ వచ్చే వరకు వేచి చూస్తే పంటలు పూర్తిగా ఎండిపోయే పరిస్థితి ఉండటంతో కొందరు రైతులు సొంత ఖర్చులతో నీటిని పారబెడుతున్నారు.
కరెంట్ లేక పంటలు ఎండిపోతున్న వేళ.. పంటను కాపాడుకునేందుకు రైతులు డీజిల్ ఖర్చు భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే సాగు ఖర్చులు పెరిగిపోయిన సమయంలో విద్యుత్ కొరత కారణంగా ట్రాక్టర్, జనరేటర్‌లపై అదనపు ఖర్చు చేయాల్సి రావడం తమపై మరింత ఆర్థిక భారం మోపుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంట చేతికొచ్చే దశలో నీరు అందక వరి ఎండిపోతే తమ పెట్టుబడి మొత్తం నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం, విద్యుత్ అధికారులు స్పందించి వరి పంటలకు అవసరమైన స్థాయిలో నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు...




