Medak: మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో విద్యుత్ కోతలపై రైతుల ధర్నాలు!

Medak: సంగారెడ్డి జిల్లాల్లో తీవ్ర విద్యుత్ కోతల కారణంగా వరి పంటలు ఎండిపోతున్నాయి బోర్లకు కరెంట్ అందక రైతులు ఆందోళన చెందుతూ సబ్‌స్టేషన్ల ఎదుట ధర్నాలు చేపట్టారు.

G Ashok Reddy, Narsapur
Published on: 7 Oct 2026 1:25 PM IST
Medak
X

Medak: మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో విద్యుత్ కోతలపై రైతుల ధర్నాలు!

Medak: ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు తీవ్ర విద్యుత్ కోతలు.. వెరసి అన్నదాతకు కష్టాలు తప్పడం లేదు. పంట చేతికొచ్చే కీలక సమయంలో విద్యుత్ సరఫరా సరిగా లేక బోర్లపై ఆధారపడి సాగు చేస్తున్న వరి పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తీవ్రమైన ఎండల కారణంగా పొలాల్లో నీటి అవసరం మరింత పెరిగింది. అయితే బోర్లకు సరిపడా విద్యుత్ సరఫరా లేకపోవడంతో పొలాలకు నీరు అందడం లేదని రైతులు చెబుతున్నారు. గంటల తరబడి కరెంట్ కోసం ఎదురుచూడాల్సి వస్తోందని, విద్యుత్ వచ్చిన సమయంలో కూడా వోల్టేజీ సమస్యలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పొలాల్లో పంట ఎండిపోతుంటే.. చేతులారా చూస్తూ ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇప్పటికే పంట సాగు కోసం విత్తనాలు, ఎరువులు, మందులు, కూలీలకు భారీగా ఖర్చు చేశామని.. ఇప్పుడు విద్యుత్ కోతల కారణంగా పంట దెబ్బతింటే పెట్టుబడి మొత్తం నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.

విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో రైతుల ఆగ్రహం క్రమంగా పెరుగుతోంది. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు పలుచోట్ల రైతులు సబ్‌స్టేషన్ల వద్దకు చేరుకుని ధర్నాలు, నిరసనలు చేపడుతున్నారు.

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని సిరిపురం, నస్తీపూర్, వడ్డేపల్లి, నాగారం తదితర ప్రాంతాలతో పాటు మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని మూసాపేట, శివంపేట, కౌడిపల్లి, చిలిపిచేడు మండలాల్లోని పలు గ్రామాల రైతులు విద్యుత్ సరఫరా సమస్యలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పంటలకు అవసరమైన సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని, విద్యుత్ కోతలను వెంటనే తగ్గించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పంటలు ఎండిపోకుండా తక్షణమే చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

మొత్తంగా.. ఎండ తీవ్రత పెరుగుతున్న వేళ విద్యుత్ కోతలు రైతుల పాలిట శాపంగా మారాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, విద్యుత్ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించకపోతే మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని రైతులు హెచ్చరిస్తున్నారు.

G Ashok Reddy, Narsapur

G Ashok Reddy, Narsapur