Uppal: గ్యాస్ మాఫియా గుట్టురట్టు.. నివాస గృహంలోనే రీఫిల్లింగ్ కేంద్రం

Uppal: మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో సివిల్ సప్లై టాస్క్‌ఫోర్స్ మెరుపుదాడి! నివాస గృహమే కేంద్రంగా సాగుతున్న భారీ అక్రమ గ్యాస్ దందా గుట్టురట్టు.

KARUNAKAR, UPPAL
Published on: 22 May 2026 9:36 PM IST
Uppal
X

Uppal: గ్యాస్ మాఫియా గుట్టురట్టు.. నివాస గృహంలోనే రీఫిల్లింగ్ కేంద్రం

Uppal: మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్ల ప్రాంతంలో గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రంపై సివిల్ సప్లై టాస్క్‌ఫోర్స్ అధికారులు నిర్వహించిన మెరుపుదాడిలో భారీ అక్రమ గ్యాస్ దందా వెలుగులోకి వచ్చింది. శ్రీ అరవింద్ ఎన్‌క్లేవ్‌లోని ఓ నివాస గృహాన్నే కేంద్రంగా మార్చుకుని కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను అక్రమంగా రీఫిల్లింగ్ చేస్తూ వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్న ముఠాను అధికారులు గుర్తించారు. సివిల్ సప్లై టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ రమేష్ రెడ్డి, ఉప్పల్ అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ సంధ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడిలో మొత్తం 55 కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు.

ప్రమాదకర పరిస్థితుల్లో ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా గ్యాస్ నింపుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని మేడిపల్లి పోలీసులకు అప్పగించారు. అధికారుల వివరాల ప్రకారం.. చెంగిచెర్ల శ్రీ అరవింద్ ఎన్‌క్లేవ్ రోడ్ నెంబర్–02లోని ఇంటిలో కొంతకాలంగా రహస్యంగా గ్యాస్ రీఫిల్లింగ్ దందా కొనసాగుతోంది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్లను తీసుకువచ్చి, అందులోని గ్యాస్‌ను ఇతర ఖాళీ కమర్షియల్ సిలిండర్లలోకి అక్రమంగా మార్చుతూ భారీ స్థాయిలో వ్యాపారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన సివిల్ సప్లై టాస్క్‌ఫోర్స్ అధికారులు ఒక్కసారిగా దాడి చేసి గ్యాస్ మాఫియా గుట్టును రట్టు చేశారు.

నివాస ప్రాంతంలోనే ఇలాంటి అక్రమ రీఫిల్లింగ్ కేంద్రాలు నిర్వహించడం వల్ల ఎప్పుడైనా భారీ అగ్నిప్రమాదం సంభవించే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. చిన్న స్పార్క్ కూడా ప్రాణాంతక ఘటనకు దారితీసే అవకాశం ఉందని తెలిపారు. అక్రమ గ్యాస్ వ్యాపారం కారణంగా ప్రభుత్వానికి ఆదాయ నష్టం కలగడంతో పాటు ప్రజల ప్రాణ భద్రత సైతం ప్రమాదంలో పడుతోందని పేర్కొన్నారు. అక్రమ గ్యాస్ ఫిల్లింగ్‌, రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్ దందాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ఇలాంటి వ్యవహారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ సంధ్య స్పష్టం చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ దాడిలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ రమణారెడ్డి, కానిస్టేబుల్ నారా ప్రభాకర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story