Pocharam: పేదల సొంతింటి కలకు పోచారంలో ఇందిరమ్మ టవర్స్!

Pocharam: మేడ్చల్ పోచారంలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి మంత్రులు పొంగులేటి, శ్రీధర్‌బాబు భూమిపూజ చేశారు.

KARUNAKAR, UPPAL
Updated on: 14 Oct 2026 4:01 PM IST
Pocharam
X

Pocharam: పేదల సొంతింటి కలకు పోచారంలో ఇందిరమ్మ టవర్స్!

పోచారం: పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. పట్టణ ప్రాంతాల్లో నివసించే నిరుపేదలకు వారు ఉంటున్న నియోజకవర్గ పరిధిలోనే నివాస వసతి కల్పించాలనే లక్ష్యంతో చేపట్టిన ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణానికి పోచారంలో బుధవారం శ్రీకారం చుట్టారు.

మేడ్చల్‌ నియోజకవర్గంలో తొలి విడతలో ఎంపికైన 480 మంది లబ్ధిదారుల కోసం నిర్మించనున్న నాలుగు టవర్స్‌కు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి భూమిపూజ చేశారు. అనంతరం లబ్ధిదారుల సమక్షంలో ఆన్‌లైన్‌ డ్రా నిర్వహించి ఫ్లాట్లను కేటాయించారు. టవర్‌, బ్లాక్‌ వివరాలతో కేటాయింపు పత్రాలను అందజేశారు.

దూర ప్రాంతాలకు వెళ్లే ఇబ్బందులు లేకుండా

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. హైదరాబాద్‌ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (క్యూర్‌) పరిధిలోని 23 నియోజకవర్గాల్లో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా మేడ్చల్‌ నియోజకవర్గంలో 480 ఇళ్లను నాలుగు టవర్స్‌లో నిర్మించనున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి సుమారు రూ.22,500 కోట్లతో ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో సొంత స్థలం ఉన్న అర్హులకు ఇళ్లు నిర్మించుకునేందుకు ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా పెరిగినప్పటికీ పేదలకు వారి నివాస ప్రాంతాలకు సమీపంలోనే ఇళ్లు అందించాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. గతంలో నగరంలో నివసించే పేదలకు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఇళ్లు కేటాయించడంతో ఉపాధి, రవాణా పరంగా ఇబ్బందులు ఎదురయ్యేవని అన్నారు.

అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఏ నియోజకవర్గంలో నివసించే వారికి అదే నియోజకవర్గ పరిధిలో ఇళ్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తొలి విడతతోనే పథకం ముగియదని, తదుపరి విడతల్లోనూ అర్హులైన పేదలకు ఇళ్లు అందించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి స్పష్టం చేశారు.

అప్పులపాలయ్యే పరిస్థితి రావొద్దు

స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ.. పేదలకు ఇళ్లు అందించడం సంతోషకరమని అన్నారు. అయితే లబ్ధిదారులు ఇప్పటికే రూ.10 వేలు, ఆ తర్వాత రూ.లక్ష చెల్లించారని పేర్కొన్నారు. మిగిలిన మొత్తాన్ని కూడా చెల్లించాల్సి వస్తే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పేద కుటుంబాలపై భారం పడకుండా మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణం రూపంలో అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇవ్వాలి

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. లబ్ధిదారులకు వారు నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇళ్లు కేటాయించడం మంచి పరిణామమన్నారు. అయితే ప్రస్తుత కుటుంబ అవసరాలకు సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు సరిపోవని, సాధ్యమైనంత వరకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు అందించే అంశాన్ని పరిశీలించాలని మంత్రిని కోరారు.

పేదల సంక్షేమానికి ప్రాధాన్యం

ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాలకు సొంతింటి సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. లబ్ధిదారులపై అదనపు ఆర్థిక భారం పడకుండా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. మేడ్చల్‌ నియోజకవర్గంలో 480 మంది లబ్ధిదారులకు ఆన్‌లైన్‌ లాటరీ ద్వారా ఫ్లాట్లు కేటాయించినట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి, హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ గౌతమ్‌, జిల్లా కలెక్టర్‌ మను చౌదరి, డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు, స్థానికులు పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL