Pocharam: తల్లికి వీడియో పంపి.. హోటల్ గదిలో యువకుడి బలవన్మరణం!
Pocharam: కార్యాలయ నగదు, ఫోన్‌పే ద్వారా రూ.99,999 బదిలీ చేసుకున్న ఆరోపణలపై బ్యాంకు ఖాతా ఫ్రీజ్ కావడంతో ఓ యువకుడు తల్లికి వీడియో పంపి హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు.
Pocharam: తల్లికి వీడియో పంపి.. హోటల్ గదిలో యువకుడి బలవన్మరణం!
పోచారం: ఉద్యోగం చేస్తున్న సంస్థలో యజమానికి తెలియకుండా నగదు, సెల్‌ఫోన్ తీసుకోవడంతోపాటు ఫోన్‌పే ద్వారా రూ.99,999 తన ఖాతాకు బదిలీ చేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
ఇన్స్పెక్టర్ జగన్నాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్ట ఆల్విన్ కాలనీకి చెందిన కోట సాయిరామ్ (29) గుంటూరులోని ఓ ప్రైవేటు థియేటర్‌లో కస్టమర్ కేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. తన తండ్రి ఆరోగ్యం బాగోలేదని చెప్పి యజమాని వద్ద రూ.10 వేలు తీసుకున్నాడు. అనంతరం కార్యాలయానికి చెందిన సెల్‌ఫోన్, రూ.6 వేల నగదును యజమానికి తెలియకుండా తీసుకెళ్లాడు.
అంతేకాకుండా కార్యాలయ ఫోన్‌పే ఖాతా నుంచి రూ.99,999 తన ఖాతాకు బదిలీ చేసుకున్నట్లు యజమాని మహీంద్రా సాయిరామ్ తల్లి వనజలక్ష్మికి ఫోన్ చేసి తెలిపాడు. దీనిపై మహీంద్రా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు శ్రీరామ్ బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేశారు.
ఈ విషయం తెలుసుకున్న సాయిరామ్ శుక్రవారం ఉదయం తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో తీసి తల్లికి, యజమానికి పంపించాడు. చౌదరిగూడలోని ఓయూ కాలనీ లివింగ్ ట్రీ హోటల్‌లోని గది నంబరు 201లో ఉన్నట్లు లొకేషన్ కూడా పంపించాడు. యజమాని హోటల్ నిర్వాహకులకు సమాచారం ఇవ్వడంతో వారు గది వద్దకు వెళ్లి తలుపులు తట్టినా స్పందన రాలేదు.
దీంతో తలుపులు పగులగొట్టి చూడగా సాయిరామ్ దుప్పటితో ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. అతడిని కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోచారం ఐటీసీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




