Meerpet: వెల్‌నెస్ ఆస్పత్రిలో నిర్లక్ష్యం: రోగి మృతితో అర్ధరాత్రి రగడ!
Meerpet: మీర్‌పేట్ వెల్‌నెస్ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో రోగి మృతి చెందాడని కుటుంబ సభ్యుల ఆందోళన.
Meerpet: వెల్‌నెస్ ఆస్పత్రిలో నిర్లక్ష్యం: రోగి మృతితో అర్ధరాత్రి రగడ!
రంగారెడ్డి (మీర్‌పేట్): రంగారెడ్డి జిల్లా యాచారం మండలానికి చెందిన మహేష్ (34) మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురం వెల్‌నెస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహేష్ భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ)లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ, బ్యాంకు ఖాతాదారులకు బీమా (ఇన్సూరెన్స్) సేవలకు సంబంధించిన పనులు చేసేవాడు.
కిడ్నీలో రాళ్ల సమస్యతో చికిత్స కోసం వెల్‌నెస్ ఆస్పత్రిలో చేరిన ఆయన, వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మహేష్ మృతి చెందిన విషయాన్ని ఆస్పత్రి యాజమాన్యం కొన్ని గంటల పాటు గోప్యంగా ఉంచిందని, అనంతరం మధ్యవర్తుల ద్వారా కుటుంబ సభ్యులతో రాజీకి ప్రయత్నించి రూ.15 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రతిపాదించిందని కూడా వారు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై ఆస్పత్రి యాజమాన్యం నుంచి అధికారిక స్పందన వెలువడలేదు.
మహేష్ మృతి పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, బంధువులు అర్ధరాత్రి ప్రధాన రహదారిపై బైఠాయించి "మాకు న్యాయం చేయాలి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి" అంటూ ధర్నాకు దిగారు. దీంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
ఆందోళనకారులు ఆస్పత్రిలోని అద్దాలను ధ్వంసం చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న మీర్‌పేట్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
మృతుడి కుటుంబ సభ్యులు, స్థానికులు ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ (డీఎంహెచ్‌వో) అధికారులు ఆస్పత్రి నిర్వహణపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా ఇదే ఆస్పత్రిలో ఇలాంటి ఘటనలు జరిగాయని వారు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




