Medipally: పీర్జాదిగూడలో విషాదం వాటర్ హీటర్ షాక్‌తో గృహిణి మృతి
Medipally: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పీర్జాదిగూడలో ఎలక్ట్రిక్ వాటర్ హీటర్ వాడుతూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై గృహిణి స్వాతి అక్కడికక్కడే మృతి.
Medipally: పీర్జాదిగూడలో విషాదం వాటర్ హీటర్ షాక్‌తో గృహిణి మృతి
మేడిపల్లి: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పీర్జాధిగూడ మల్లికార్జున నగర్‌లో సోమవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. వేడి నీటి కోసం బకెట్‌లో ఉంచిన ఎలక్ట్రిక్ హీటర్ కారణంగా కరెంట్ షాక్‌కు గురై ఓ గృహిణి మృతి చెందింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం భువనగిరి హనుమాన్‌వాడకు చెందిన దుడ్డికారి స్వాతి (40) తన భర్త శ్రీనివాస్, ముగ్గురు పిల్లలతో కలిసి పీర్జాదిగూడ మల్లికార్జున నగర్‌లో నివాసం ఉంటున్నారు. శ్రీనివాస్ చర్లపల్లిలోని ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో ఉద్యోగం చేస్తున్నారు.
గతంలో అద్దె ఇంట్లో నివసించిన ఈ కుటుంబం, ప్రస్తుతం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని పోర్షన్‌ను కొనుగోలు చేసి ఏడాది క్రితం సొంతింట్లోకి మారింది. సోమవారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో ఇంట్లో వేడి నీటి కోసం బకెట్‌లో ఎలక్ట్రిక్ హీటర్ ఉంచారు.
ఈ క్రమంలో స్వాతి ప్రమాదవశాత్తు జారి పడగా, ఆమె చేయి హీటర్ ఉన్న నీటిలో పడటంతో తీవ్ర కరెంట్ షాక్‌కు గురైనట్లు సమాచారం. షాక్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. విద్యుత్ ప్రభావంతో ఆమె శరీరంలోని కొంత భాగం మంటలతో దగ్ధమైనట్లు తెలుస్తుంది.
పొగ వస్తుండటాన్ని గమనించిన స్థానికులు ఇంటి వద్దకు చేరుకుని చూడగా, స్వాతి మంటలతో కాలుతున్న స్థితిలో కనిపించింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనకు గల పూర్తి కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




