Medipally: అమాయక కుటుంబం నుంచి రూ.25 లక్షలు కాజేసిన కేటుగాడు

Medipally: మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దళిత బంధు పథకం, ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో జరిగిన ₹25 లక్షల ఘరానా మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

KARUNAKAR, UPPAL
Published on: 29 May 2026 7:18 PM IST
Medipally
X

Medipally: అమాయక కుటుంబం నుంచి రూ.25 లక్షలు కాజేసిన కేటుగాడు

Medipally: మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దళిత బంధు పథకం, ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో భారీ మోసం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పీర్జాదిగూడ రాధాకృష్ణ కాలనీకి చెందిన రిటైర్డ్ ఉద్యోగి బుద్ధ వినోద్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం 2022లో ఖైరతాబాద్ ఆనంద్‌నగర్‌కు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి, తనకు ఉన్న పరిచయాలతో తాత్కాలిక ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించగలనని, దళిత బంధు పథకం కింద వాహనాలు మంజూరు చేయిస్తానని నమ్మించాడు. ఈ క్రమంలో బాధితుడి ఇద్దరు కుమారులకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి పేరుతో రూ.2.12 లక్షల చొప్పున వసూలు చేశాడు.

అనంతరం దళిత బంధు వాహనం ఇప్పిస్తానంటూ మరో రూ.2 లక్షలు తీసుకున్నాడు. తర్వాత మున్సిపల్ కార్యాలయాలు, కోర్టుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పెద్ద కుమారుడి కోసం రూ.6 లక్షలు, కుమార్తె కోసం రూ.4 లక్షలు తీసుకున్నట్లు బాధితుడు పేర్కొన్నారు. వ్యక్తిగత అవసరాల పేరుతో మరో రూ.8 లక్షలు తీసుకుని మొత్తం రూ.25 లక్షలు కాజేసినట్లు ఫిర్యాదులో వెల్లడించారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగగా నిందితుడు చెక్కులు ఇచ్చినా, అవి బ్యాంకులో బౌన్స్ అయ్యాయని తెలిసింది. అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారైనట్లు బాధితుడు ఆరోపించాడు. ఇదే తరహాలో మరికొంత మందిని కూడా మోసం చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story