Medipally: మేడిపల్లిలో వరుస దొంగతనాలకు చెక్: ఆటో డ్రైవర్ ముసుగులో హౌస్ బ్రేకింగ్.. పాత నేరస్తుడు అరెస్ట్!
Medipally: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస ఇళ్ల చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడు ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి వెండి ఆభరణాలు, బైక్ స్వాధీనం చేసుకున్నారు.
Medipally: మేడిపల్లిలో వరుస దొంగతనాలకు చెక్: ఆటో డ్రైవర్ ముసుగులో హౌస్ బ్రేకింగ్.. పాత నేరస్తుడు అరెస్ట్!
మేడిపల్లి: మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా జరుగుతున్న ఇళ్ల చోరీలకు పాల్పడిన ప్రశాంత్ అనే పాత నేరస్తుడుని మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్ కి తరలించారు. బోడుప్పల్, పీర్జాదిగూడ, కాచివనిసింగారం ప్రాంతాల్లో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని హౌస్ బ్రేకింగ్ చేసేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసుల వివరాల ప్రకారం, సూర్యాపేట జిల్లాకు చెందిన అలకుంట్ల ప్రశాంత్ (19) ప్రస్తుతం బోడుప్పల్ లో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రాత్రి వేళల్లో ఖాళీ ఇళ్లను గుర్తించి తాళం పగులగొట్టి లోపలికి చొరబడి నగదు, బంగారం, వెండి ఆభరణాలు దోచుకునేవాడు. దొంగిలించిన వస్తువులను పరిచయస్తుల ద్వారా విక్రయించినట్లు విచారణలో వెల్లడైంది.
ఈ ఘటనలపై ప్రత్యేక దృష్టి సారించిన మేడిపల్లి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారం ఆధారంగా నిందితుడి కదలికలను ట్రాక్ చేశారు. చివరకు పీర్జాదిగూడ ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వరస చోరీలకు సంబంధించి 2026 పిబ్రవరి నుండి ఇప్పటివరకు మేడిపల్లి పిఎస్ పరిధిలో మొత్తం 10 కేసులు నమోదు కాగా, అన్నింటినీ నిందితుడు ప్రశాంతే అని పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుడి వద్ద నుండి హీరో హోండా స్ప్లెండర్ బైక్, ఒక ఐఫోన్, సుమారు 40 తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు. 2023 సంవత్సరంలో ప్రశాంత్ మైనర్ గా ఉన్న సమయంలో కూడా పలు దోపిడి కేసుల్లో పాల్గొని జువెనైల్ హోమ్‌కు వెళ్లినప్పటికీ, విడుదలైన తర్వాత మళ్లీ నేరాలకు పాల్పడుతున్నాడు. నిందితుడిని కోర్టులో హాజరు పరచి, రిమాండ్ కి తరలించారు. సంపూర్ణ దర్యాప్తు కొనసాగుతిన్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రజలు ఇళ్ల భద్రత పై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.




