Medipally: మేడిపల్లిలో బైక్ దొంగల అరెస్ట్ 11 వాహనాలు స్వాధీనం!
Medipally: మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితుల అరెస్ట్. వారి నుంచి 11 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు!
Medipally: మేడిపల్లిలో బైక్ దొంగల అరెస్ట్ 11 వాహనాలు స్వాధీనం!
మేడిపల్లి: ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మేడిపల్లి ఇన్‌స్పెక్టర్ డి. జలేందర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇళ్ల వద్ద, పార్కింగ్ ప్రదేశాల్లో నిలిపిన ద్విచక్ర వాహనాలను నిందితులు చోరీ చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఎస్‌హెచ్‌ఓ డి. జలేందర్ రెడ్డి, డీఐ కే. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరాల దృశ్యాలు, స్థానిక సమాచారం ఆధారంగా బోడుప్పల్ కమాన్ సమీపంలో ఇద్దరు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిని ఉత్తరప్రదేశ్‌లోని దేవరాయ జిల్లాకు చెందిన అరవింద్ కుమార్ ఉపాధ్యాయ అలియాస్ రాజు (56), యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామానికి చెందిన తుంగ మధు (29)గా గుర్తించారు. అరవింద్ బోడుప్పల్‌లో నివాసముంటూ వెయిటర్‌గా పనిచేస్తుండగా, మధు చెంగిచెర్లలో నివసిస్తూ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నకిలీ తాళంచెవులతో ద్విచక్ర వాహనాల తాళాలు తెరిచి చోరీలకు పాల్పడేవారని పోలీసుల విచారణలో తేలింది. అరవింద్ చోరీ చేసిన వాహనాలను మధుకు అప్పగించేవాడని, అతడు వాటిని తనకు తెలిసిన వ్యక్తులకు విక్రయించేవాడని వెల్లడైంది. ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం 11 కేసులను గుర్తించి, నిందితుల నుంచి మొత్తం 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు రిమాండ్ విధించింది. కేసులపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఇన్‌స్పెక్టర్ జలేందర్ రెడ్డి తెలిపారు.




