Medipally: 20 గంటల్లోనే చైన్ స్నాచింగ్ కేసు ఛేదించిన మేడిపల్లి పోలీసులు!

Medipally: చెంగిచెర్లలో చైన్ స్నాచింగ్ 20 గంటల్లోనే కేసు ఛేదించిన మేడిపల్లి పోలీసులు, ఇద్దరు నిందితుల అరెస్ట్, 3 తులాల గోల్డ్ సీజ్.

KARUNAKAR, UPPAL
Published on: 4 Sept 2026 12:31 PM IST
Medipally
X

Medipally: 20 గంటల్లోనే చైన్ స్నాచింగ్ కేసు ఛేదించిన మేడిపల్లి పోలీసులు!

Medipally: చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీలో మహిళ మెడలోని బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లిన చైన్‌ స్నాచింగ్‌ కేసును మేడిపల్లి పోలీసులు 20 గంటల్లోనే ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి మూడు తులాల బంగారు పుస్తెలతాడు, ద్విచక్ర వాహనం, రెండు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించనున్నారు.

మేడిపల్లి ఏసీపీ మోహన్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ రాజమండ్రికి చెందిన కంగాల వీవీఎస్‌వీ ప్రసాద్‌, తెలంగాణలోని వరంగల్‌ జిల్లా నర్సంపేటకు చెందిన అజ్మీర వెంకటేష్‌ ఏడాది నుంచి స్నేహితులు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో బంగారు ఆభరణాలు ధరించిన మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడాలని పథకం వేశారు.

ఇందులో భాగంగా ఓఎన్ఎన్ యాప్‌ ద్వారా ద్విచక్ర వాహనాన్ని బుక్‌ చేసుకుని ఉప్పల్‌లో తీసుకున్నారు. అనంతరం పోచారం, చెంగిచెర్ల పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ మహిళలను గమనించారు. సెప్టెంబర్‌ 2న రాత్రి 8.20 గంటలకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న చల్ల భారతిని గుర్తించారు. అజ్మీర వెంకటేష్‌ ఆమె మెడలోని బంగారు పుస్తెలతాడును బలవంతంగా లాక్కున్నాడు.

ద్విచక్ర వాహనంపై సిద్ధంగా ఉన్న ప్రసాద్‌ వద్దకు చేరుకుని, ఇద్దరూ అదే వాహనంపై చెంగిచెర్ల వైపు పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మేడిపల్లి పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాలతో పాటు సాంకేతిక ఆధారాలను విశ్లేషించి దర్యాప్తు చేపట్టారు. చోరీ జరిగిన 20 గంటల్లోనే నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారి వద్ద నుంచి చోరీ చేసిన మూడు తులాల బంగారు పుస్తెలతాడు, బైక్‌, రెండు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ఆర్థిక ఇబ్బందుల కారణంగానే నిందితులు చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడినట్లు విచారణలో తేలిందని, నిందితులను కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కి తరలించనున్నట్లు ఏసీపీ మోహన్‌కుమార్‌ తెలిపారు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని, నిందితులపై గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా? అనే కోణంలోనూ పరిశీలిస్తున్నట్లు చెప్పారు. కేసును చాకచక్యంగా 20 గంటల్లోనే ఛేదించిన మేడిపల్లి క్రైమ్‌ పోలీసులను ఏసీపీ మోహన్‌కుమార్‌ అభినందించారు. దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి పారితోషికం అందజేశారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story