Medipally: భర్తను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించిన భార్య అరెస్ట్

Medipally: మేడిపల్లిలో భర్తను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన భార్య సునీత అరెస్ట్. దర్యాప్తులో వెలుగుచూసిన సంచలన నిజాలు.

KARUNAKAR, UPPAL
Published on: 17 Aug 2026 6:12 PM IST
Medipally
X

Medipally: భర్తను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించిన భార్య అరెస్ట్

మేడిపల్లి: భర్తను హత్య చేసి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన భార్యను మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల దర్యాప్తులో హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల వివరాల ప్రకారం.. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పీర్జాదిగూడ రాఘవేంద్ర కాలనీకి చెందిన సత్యనారాయణ (51) ఆగస్టు 6న నైట్ డ్యూటీ ముగించుకుని మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు.

అనంతరం అతని భార్య సునీత (44) పనికి వెళ్లి మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చింది. ఆ సమయంలో సత్యనారాయణ మద్యం సేవించి ఉండటంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భర్త తనను మానసికంగా వేధిస్తున్నాడనే ఆగ్రహంతో సునీత అతడిపై దాడికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.

నిందితురాలు సత్యనారాయణ చేతులు, కాళ్లను చీరతో కట్టి, సెంట్రింగ్‌ కర్రతో తలపై, శరీరంలోని ఇతర భాగాలపై తీవ్రంగా కొట్టినట్లు పోలీసులు తెలిపారు. దాడిలో తీవ్రంగా గాయపడిన సత్యనారాయణ స్పృహ కోల్పోయాడు. అనంతరం సునీత.. సత్యనారాయణ కుమారుడు నికిత్‌కు ఫోన్ చేసి, తన తండ్రి వాహనం నుంచి ప్రమాదవశాత్తు జారిపడి గాయపడ్డాడని తప్పుడు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.

గాయపడిన సత్యనారాయణను బోడుప్పల్‌లోని మెడిస్టార్‌ ఆసుపత్రికి తరలించగా, వైద్యుల సూచన మేరకు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ రాత్రి 10.18 గంటలకు వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నివేదిక, వైద్యుల అభిప్రాయం, సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు.

ప్రమాదం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో భార్యను విచారించారు. విచారణలో భర్త తనను, పిల్లలను మానసికంగా వేధించడంతో ఆగ్రహానికి గురై దాడి చేసినట్లు నిందితురాలు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఆమె చూపిన ప్రదేశం నుంచి మృతుడి చేతులు, కాళ్లు కట్టేందుకు ఉపయోగించిన చీర, దాడికి ఉపయోగించిన సెంట్రింగ్‌ కర్రను పంచుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. సేకరించిన ఆధారాల ఆధారంగా తొలుత నమోదైన రోడ్డు ప్రమాద కేసును, హత్య కేసుగా మార్చారు. నిందితురాలు సునీతను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు మేడిపల్లి ఇన్సెక్టర్ జలేంధర్ రెడ్డి తెలిపారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story