Hyderabad: సైక్లింగ్‌ను జీవనశైలిగా మార్చుకోవాలి
Hyderabad: ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం జరిగింది.
Hyderabad: సైక్లింగ్‌ను జీవనశైలిగా మార్చుకోవాలి
హైదరాబాద్: ఫిట్ ఇండియా, ఆరోగ్యకర జీవనశైలి, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాల సాధనలో సైక్లింగ్ కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. ఆదివారం ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఫిట్ ఇండియా స్పూర్తి తో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (SATG) ఆధ్వర్యంలో భారత క్రీడా ప్రాధికార సంస్థ (SAI) సౌజన్యంతో గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన "సండేస్ ఆన్ సైకిల్" కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ సైకిల్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.
భారీ సంఖ్యలో సైక్లింగ్ ప్రేమికులు, యువత, క్రీడాకారులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, సైక్లింగ్ ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రజలు తమ దినచర్యలో సైక్లింగ్‌కు స్థానం కల్పించాలని సూచించారు. ‘సండేస్ ఆన్ సైకిల్’ వంటి కార్యక్రమాలు పౌరుల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించడమే కాకుండా సైక్లింగ్‌ను జీవనశైలిలో భాగంగా మార్చుకునేందుకు ప్రోత్సహిస్తాయని అన్నారు.
ప్రపంచ సైకిల్ దినోత్సవం సైక్లింగ్‌ను సరసమైన రవాణా విధానంగా, పర్యావరణహిత ప్రయాణ సాధనంగా, సమర్థవంతమైన ఫిట్‌నెస్ కార్యకలాపంగా గుర్తిస్తోందని గవర్నర్ పేర్కొన్నారు. ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు ఆరోగ్యకరమైన నగరాల నిర్మాణానికి సైక్లింగ్ ఒక సుస్థిర పరిష్కారమని వివరించారు.
కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి, క్రీడల సలహాదారు జితేందర్ రెడ్డి, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, SATG వైస్ చైర్‌పర్సన్, ఎండీ సోనీ బాలాదేవి తదితరులు పాల్గొన్నారు.




