Uppal: మెప్మా అదనపు సంచాలకుడు యాదగిరిరావు ఆస్తులు రూ.4.75 కోట్లు!
Uppal: మెప్మా అదనపు సంచాలకుడు నల్లగుంట యాదగిరిరావుపై ఏసీబీ పంజా విసిరింది. 10 చోట్ల సోదాలు నిర్వహించి ప్రభుత్వ విలువ ప్రకారమే రూ.4.75 కోట్ల ఆస్తులను అధికారులు గుర్తించారు.
Uppal: మెప్మా అదనపు సంచాలకుడు యాదగిరిరావు ఆస్తులు రూ.4.75 కోట్లు!
ఉప్పల్: పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తున్న ప్రభుత్వ విభాగం మెప్మా (MEPMA) అదనపు సంచాలకుడు నల్లగుంట యాదగిరిరావు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్, సూర్యాపేట తదితర ప్రాంతాల్లో మొత్తం పది చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఆయన నివాసం, కార్యాలయం, బ్యాంకు లాకర్లు, బంధువులు, సన్నిహితులు, బినామీలకు సంబంధించిన ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
సోదాల్లో ప్రభుత్వ విలువ ప్రకారం మొత్తం రూ.4,75,61,171 విలువైన ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది. ఇందులో హైదరాబాద్, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న 12 ఓపెన్ ప్లాట్ల విలువ రూ.58.63 లక్షలుగా గుర్తించారు. ఉప్పల్‌లో రెండు నివాస ఫ్లాట్ల విలువ రూ.31.36 లక్షలు, జీ+3 అంతస్తులతో పాటు పెంట్‌హౌస్ కలిగిన మరో భవనం విలువ సుమారు రూ.2 కోట్లుగా అంచనా వేశారు. సూర్యాపేట జిల్లాలో ఆర్‌సీసీ పైకప్పుతో ఉన్న మరో ఇంటి విలువ రూ.4.75 లక్షలుగా, ఉప్పల్‌లోని వాణిజ్య దుకాణం విలువ రూ.1.06 లక్షలుగా గుర్తించారు.
బంగారం, కార్లు.. బ్యాంకు నిల్వలు
సుమారు 1,792.2 గ్రాముల బంగారు ఆభరణాలు (రూ.33.82 లక్షలు), మూడు కిలోల వెండి ఆభరణాలు (రూ.1.80 లక్షలు) గుర్తించారు. టయోటా ఫార్చ్యూనర్‌తో పాటు మరో కారు విలువ రూ.73 లక్షలుగా, మూడు ద్విచక్ర వాహనాల విలువ రూ.2.80 లక్షలుగా లెక్కించారు. ఇంట్లోని వస్తువుల విలువ రూ.29.08 లక్షలు, ఎలక్ట్రానిక్ పరికరాల విలువ రూ.7,01,171గా గుర్తించారు. వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.32.30 లక్షల నిల్వలు ఉన్నట్లు వెల్లడించారు.
మార్కెట్ విలువ మరింత అధికం!
ప్రస్తుతం గుర్తించిన ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం మాత్రమేనని, బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం వీటి విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఏసీబీ పేర్కొంది. అదనపు ఆస్తుల గుర్తింపు కోసం తనిఖీలు, ధ్రువీకరణ కొనసాగుతున్నాయి. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా యాదగిరిరావును హైదరాబాద్‌లోని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి, న్యాయ రిమాండ్‌కు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు.




