Hyderabad: ఎర్రవల్లి ఘటనపై మంత్రి పొన్నం మండిపాటు BRS చర్యలు సిగ్గుచేటు!
Hyderabad: శాసన మండలిలో BRS తీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం. ఎర్రవల్లిలో దళితులు నిరసన తెలిపిన ప్రదేశాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం.
Hyderabad: ఎర్రవల్లి ఘటనపై మంత్రి పొన్నం మండిపాటు BRS చర్యలు సిగ్గుచేటు!
Hyderabad: ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి తలవంపు తెచ్చేలా BRS వ్యవహరిస్తోంది. ఎర్రవల్లి వద్ద దళితులు డప్పులు కొడుతూ నిరసన తెలిపిన ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. దళితులు డప్పులు కొట్టిన ప్రదేశాన్ని శుద్ధి చేయడం దళితులను, యావత్ సమాజాన్ని అవమానించడమే.
నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించింది. డప్పు కొట్టడం దళితుల సంప్రదాయ వృత్తిలో భాగం. నిరసనల్లో డప్పులను ఉపయోగించడం కొత్తేమీ కాదు. తెలంగాణ రాష్ట్రం కోసం కోట్లాడినప్పుడు రాష్ట్రం ఏర్పడితే 90 శాతం ఉన్న బడుగు, బలహీన, అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని ఆశించాం.
కానీ నేడు ఎస్సీ, ఎస్టీ, బీసీలను నిమ్నంగా భావించే పరిస్థితులు కనిపించడం బాధాకరం. దళితులు డప్పులు కొట్టి నిరసన తెలిపిన ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయడం వెనుకటి రోజుల్లో ఉన్న తారతమ్యాలను గుర్తుకు తెస్తోంది. ఇలాంటి చర్యలు సమాజంలో తీవ్ర అసమానతలకు, శాంతిభద్రతల సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది.
14 సార్లు ఎన్నికల్లో గెలిచిన ప్రజాస్వామ్యవాది, రాజ్యసభ ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్న సభా ప్రాంగణాన్ని కూడా బీజేపీ నేతలు శుద్ధి చేశారు. అక్కడ బీజేపీ ఇక్కడ brs దళితులకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇప్పుడు దళితులు డప్పులు కొడుతూ నిరసన తెలిపిన ప్రాంతాన్ని శుద్ధి చేయడం దళితులను అవమానించడమే.
పసుపు పవిత్రమైనదే.. గౌరమ్మ, కొమురవెల్లి మల్లన్న, ఎల్లమ్మ ఆలయాల్లో బండారిగా ఉపయోగించే పసుపును ఇలా అవమానకరమైన రీతిలో శుద్ధి కార్యక్రమాలకు ఉపయోగించడం బాధాకరం. దళితులను అవహేళన చేస్తూ, వారు నిరసన తెలిపిన ప్రదేశాన్ని శుద్ధి చేయడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. తలవంచుకునే పరిస్థితి.
ఇలాంటి సంఘటనలను శాసన మండలి తీవ్రంగా ఖండించాలి. నిన్న ఎర్రవల్లి వద్ద జరిగిన ఘటనపై సభ విచారం వ్యక్తం చేయాలి. BRS నేతలు చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. అణగారిన వర్గాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఇలాంటి చర్యలను సహించేది లేదు. తెలంగాణలో సామాజిక న్యాయం, సమానత్వం, రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.




