Kapra: గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి: మంత్రి సీతక్క పిలుపు!

Kapra: చర్లపల్లి ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూల్ చైర్మన్ గడ్డం యాదగిరి జన్మదినం సందర్భంగా 100 మంది గర్భిణులకు నిర్వహించిన సామూహిక సీమంతం వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొని మహిళలను ఆశీర్వదించారు.

ASHOK, KAPRA
Published on: 6 Sept 2026 11:18 PM IST
Kapra
X

Kapra: గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి: మంత్రి సీతక్క పిలుపు!

కాప్రా: చర్లపల్లిలోని ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూల్‌లో గర్భిణీ మహిళల కోసం సీమంతం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూల్ చైర్మన్ గడ్డం యాదగిరి జన్మదినాన్ని పురస్కరించుకుని పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచేలా 100 మంది గర్భిణులకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై గర్భిణులను సాంప్రదాయబద్ధంగా ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీలు పౌష్టికాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఫాస్ట్‌ఫుడ్‌, కల్తీ ఆహారానికి దూరంగా ఉండి ఇంట్లో తయారు చేసిన సహజమైన పోషకాహారం, తాజా పండ్లు, డ్రైఫ్రూట్స్‌ తీసుకోవాలని కోరారు. తల్లి తీసుకునే ఆహారం గర్భంలోని శిశువు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని తెలిపారు.

వైద్యుల సూచనల మేరకు ప్రతిరోజూ తేలికపాటి నడక చేస్తూ చురుగ్గా ఉండాలని, మానసిక ప్రశాంతతను కాపాడుకోవాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, చిన్నారులకు పౌష్టికాహారం, కోడిగుడ్లు తదితర సేవలు అందిస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ అంగన్‌వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కార్యక్రమంలో చైల్డ్‌ ప్రొటెక్షన్‌ కమిటీ సభ్యురాలు సరిత, యూపీహెచ్‌సీ డాక్టర్‌ ప్రియాంక, చర్లపల్లి సీఐ సుధాకర్‌, స్థానిక ప్రజాప్రతినిధులు, అంగన్‌వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గడ్డం యాదగిరికి పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలతో ఆప్యాయంగా మెలుగుతూ, ‘నేనున్నా’ అంటూ అండగా నిలిచే గడ్డం యాదగిరి భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని వారు ఆకాంక్షించారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA

Next Story