Nacharam: విఎస్టీ కాలనీలో దసరా నవరాత్రి ఉత్సవాలు.. అమ్మవారికి మంత్రి పూజలు!
Nacharam: హైదరాబాద్ నాచారంలో విఎస్టీ కాలనీ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి శ్రీధర్‌బాబు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, సంక్షేమ పథకాలపై కీలక వ్యాఖ్యలు.
Nacharam: విఎస్టీ కాలనీలో దసరా నవరాత్రి ఉత్సవాలు.. అమ్మవారికి మంత్రి పూజలు!
Nacharam: హైదరాబాద్ నాచారంలోని విఎస్టీ కాలనీలో విఎస్టీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అసోసియేషన్, మాజీ సైనికుడు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకునేందుకు రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మంత్రికి ఘనస్వాగతం పలికారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు మంత్రి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అర్హులైన రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి ఆరు కిలోల సన్నబియ్యం పంపిణీ చేయడంతో పాటు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు.
రాష్ట్రంలో మెట్రో రైలు విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ప్రకృతి వైపరీత్యాల ప్రభావం ఎలినో నేపథ్యంలో ప్రజలు విద్యుత్, నీటిని పొదుపుగా వినియోగించాలని మంత్రి సూచించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలు వనరులను బాధ్యతాయుతంగా వినియోగిస్తూ, పరస్పరం సహకరించుకోవాలని కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.
శరన్నవరాత్రి ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించిన అసోసియేషన్ నిర్వాహకులను మంత్రి అభినందించారు. భక్తి, ఆధ్యాత్మికతతో పాటు సామాజిక ఐక్యతను పెంపొందించడంలో ఇలాంటి ఉత్సవాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. అనంతరం అమ్మవారిని నిమజ్జనానికి తరలించే కార్యక్రమాన్ని భక్తులు, నిర్వాహకులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు వజ్రేష్ యాదవ్,పరమేశ్వర్ రెడ్డి తో పాటు స్థానిక కాంగ్రెస్ నేతలు, కాలనీ వాసులు, అసోసియేషన్ సభ్యులు, మహిళలు, యువకులు, భక్తులు పాల్గొన్నారు.




