Miyapur: మియాపూర్లో విషాదం.. లిఫ్ట్ గుంతలో పడి యువకుడు మృతి!
Miyapur: మియాపూర్ పరిధిలోని జనప్రియ అపార్ట్మెంట్లో విషాదం చోటుచేసుకుంది. లిఫ్ట్ సాంకేతిక లోపం కారణంగా గుంతలో పడి 23 ఏళ్ల దివ్యాంగుడైన యువకుడు దుర్మరణం చెందాడు
Miyapur: మియాపూర్లో విషాదం.. లిఫ్ట్ గుంతలో పడి యువకుడు మృతి!
Miyapur: మియాపూర్ పరిధిలోని జనప్రియ అపార్ట్మెంట్లో విషాదం చోటుచేసుకుంది. లిఫ్ట్ గుంత (షాఫ్ట్)లో ప్రమాదవశాత్తు జారిపడి 23 ఏళ్ల దివ్యాంగుడైన యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక జనప్రియ అపార్ట్మెంట్కు చెందిన వెంకటేష్ కుమారుడు విజయ్ బాబు (23) కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు.
ఈ క్రమంలో నాలుగో అంతస్తులో ఉన్న విజయ్ బాబు లిఫ్ట్ ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో లిఫ్ట్ కేబిన్ మొదటి అంతస్తులోనే ఉన్నప్పటికీ, సాంకేతిక లోపంతో నాలుగో అంతస్తులోని తలుపులు తెరుచుకున్నాయి.
లిఫ్ట్ కేబిన్ ఉందనే భ్రమలో లోపలికి అడుగుపెట్టిన విజయ్ బాబు, నేరుగా నాలుగో అంతస్తు నుంచి లిఫ్ట్ గుంతలో పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలు కాగా, గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, పరిశీలించిన వైద్యులు విజయ్ బాబు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
ఘటనపై సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. లిఫ్ట్ నిర్వహణ లోపం లేదా సాంకేతిక వైఫల్యంపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.




