Miyapur: భోజనంలో నిద్రమాత్రలు కలిపి, దిండుతో నొక్కి హత్య!

Miyapur: సైబరాబాద్ పరిధిలోని మియాపూర్‌లో గత నవంబర్‌లో నమోదైన వ్యాపారి మల్లాని పెంతేష్ (57) అదృశ్యం కేసు దారుణ హత్యగా తేలింది

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 8 July 2026 11:36 PM IST
Miyapur
X

Miyapur: భోజనంలో నిద్రమాత్రలు కలిపి, దిండుతో నొక్కి హత్య!

మియాపూర్: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొన్ని నెలల క్రితం నమోదైన ఒక వ్యక్తి అదృశ్యం కేసు అత్యంత ఘోరమైన హత్యగా తేలింది. ఆస్తిని దక్కించుకోవడంతో పాటు అక్రమ సంబంధానికి అడ్డంగా ఉన్నాడనే నెపంతో భార్యే తన ప్రియుడు, మరో సహచరుడితో కలిసి భర్తను ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేసిన ఉదంతం సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది.

అసలేం జరిగింది?....DCP రితురాజ్ తెలిపిన వివరాల ప్రకారం...

రంగారెడ్డి జిల్లా మియాపూర్‌కు చెందిన మల్లాని పెంతేష్ (57) వ్యాపారం చేస్తూ జీవించేవాడు. ఆయన భార్య మల్లాని సత్యావతి (47) కి మర్రి మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. పెంతేష్ ఆస్తిని పూర్తిగా స్వాధీనం చేసుకోవాలనే దురాశతో, తమ స్వేచ్ఛకు అడ్డు లేకుండా చూసుకోవడం కోసం మధుసూదన్ రెడ్డితో కలిసి సత్యావతి భర్తను వదిలించుకోవడానికి పథకం రచించింది.

ఈ కుట్రలో భాగంగా మధుసూదన్ రెడ్డి నవంబర్ 18, 2025 న నిద్రమాత్రలను తీసుకొచ్చి సత్యావతికి ఇచ్చాడు. అదే రోజు రాత్రి సత్యావతి ఆ మాత్రలను భర్త పెంతేష్ తినే భోజనంలో కలిపింది. పెంతేష్ ఆహారం తిని స్పృహ కోల్పోయిన తర్వాత... మధుసూదన్ రెడ్డి తన స్నేహితుడైన దిద్ది రాజేష్ కుమార్‌తో కలిసి సత్యావతి ఇంటికి చేరుకున్నాడు. ముగ్గురూ కలిసి పెంతేష్ ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేశారు.

మృతదేహం మాయం.. మిస్సింగ్ డ్రామా!....

హత్య అనంతరం నిందితులు శవాన్ని దాచడానికి ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. మధుసూదన్ రెడ్డి ముందే సమకూర్చుకున్న పెట్రోల్‌ను తీసుకొని, పెంతేష్ శవాన్ని ఒక XUV 500 కారు (TS 09 ET 3014) లో ఎక్కించారు. శవాన్ని మహారాష్ట్రలోని నల్దుర్గ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి తరలించి, అక్కడ నిర్మానుష్య ప్రాంతంలో పెట్రోల్ పోసి సగం కాలిన స్థితిలో పడేసి వచ్చారు.

ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా నటించిన భార్య సత్యావతి, నవంబర్ 25, 2025 న మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో తన భర్త నవంబర్ 19 నుండి కనిపించడం లేదంటూ తప్పుడు ఫిర్యాదు ఇచ్చింది. పోలీసులు దీనిని మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

లొంగిపోవడంతో వెలుగుచూసిన నిజం...

కేసును లోతుగా పరిశోధించాల్సిందిగా ఉన్నతాధికారులు సబ్-ఇన్‌స్పెక్టర్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో నిందితులు పోలీసుల నిఘా తీవ్రమవడంతో తట్టుకోలేకపోయారు. జూలై 8, 2026 ఉదయం వేళ, శ్రీ శోభన్ బాబు అనే వ్యక్తితో కలిసి నిందితులు పోలీస్ స్టేషన్‌కు వచ్చి తాము చేసిన నేరాన్ని అంగీకరిస్తూ ‘ఎక్స్‌ట్రా జ్యుడీషియల్ కన్ఫెషన్’ స్టేట్‌మెంట్‌ను సమర్పించారు. నిందితురాలు సత్యావతిని పోలీసులకు అప్పగించారు.

ప్రాథమిక విచారణలో సత్యావతి నేరాన్ని పూర్తిగా ఒప్పుకోవడంతో, పోలీసులు కేసును హత్య కేసుగా మారుస్తూ బిఎన్ఎస్ (BNS) సెక్షన్లు 103(1), 238, 231 r/w 61 కింద మార్చారు. తదనంతరం మిగిలిన ఇద్దరు నిందితులైన మధుసూదన్ రెడ్డి, రాజేష్ కుమార్‌లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న సొత్తు:...

నిందితుల నుండి పోలీసులు కింది వాటిని స్వాధీనం చేసుకున్నారు:

* 4 మొబైల్ ఫోన్లు (సత్యావతి నుండి రెండు, మిగిలిన వారి నుండి రెండు)

* 4 తులాల బంగారు గొలుసు మరియు రూ. 2 లక్షల నగదు (మధుసూదన్ రెడ్డి నుండి)

* శవాన్ని తరలించడానికి ఉపయోగించిన XUV 500 కారు.

మహారాష్ట్ర పోలీసులు నవంబర్ 19, 2025 న గుర్తించిన గుర్తుతెలియని మృతదేహం పెంతేష్‌దేనని, అక్కడ సేకరించిన ఎముకల (Femur bone) ఆధారంగా మరియు నిందితుల వాంగ్మూలంతో పోలీసులు ధృవీకరించారు. ఈ కేసును చాకచక్యంగా చేధించిన కుకట్‌పల్లి డిసిపి, మియాపూర్ ఏసిపి మరియు స్టేషన్ హౌస్ ఆఫీసర్ నేతృత్వంలోని పోలీస్ బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY

Next Story