Secunderabad: బతుకమ్మ స్పెషల్ రైలును రెగ్యులర్ చేయాలి: ఎమ్మెల్యే హరీష్ బాబు!

Secunderabad: సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ ప్రత్యేక రైలును 'బతుకమ్మ ఎక్స్‌ప్రెస్' పేరుతో రెగ్యులర్ చేయాలని దక్షిణ మధ్య రైల్వే జీఎంను కోరిన ఎమ్మెల్యే హరీష్ బాబు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 12 Oct 2026 3:24 PM IST
Secunderabad
X

Secunderabad: బతుకమ్మ స్పెషల్ రైలును రెగ్యులర్ చేయాలి: ఎమ్మెల్యే హరీష్ బాబు!

Secunderabad: సికింద్రాబాద్‌–సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య ప్రస్తుతం నడుస్తున్న బతుకమ్మ పండుగ స్పెషల్ రైలును శాశ్వతంగా కొనసాగించాలని సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు కోరారు. ఈ రైలును రెగ్యులర్ సర్వీస్‌గా మార్చడంతో పాటు, తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా ‘బతుకమ్మ ఎక్స్‌ప్రెస్‌’ అని నామకరణం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్‌తో కలిసి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఎస్.కే. శ్రీవాత్సవను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చేర్యాల నక్కాషీ శైలిలో రూపొందించిన బతుకమ్మ చిత్రపటాన్ని జీఎంకు అందించారు.

ప్రస్తుతం పండుగ సందర్భంగా నడుస్తున్న ఈ ప్రత్యేక రైలుకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఈ రైలును శాశ్వతంగా కొనసాగిస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలతో పాటు హైదరాబాద్‌కు రాకపోకలు సాగించే ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని వివరించారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పేరును ఈ రైలుకు పెట్టడం సముచితమని, ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైలును రెగ్యులరైజ్ చేయాలని కోరారు. ఎమ్మెల్యేల విజ్ఞప్తిపై దక్షిణ మధ్య రైల్వే జీఎం సానుకూలంగా స్పందించి, ఈ ప్రతిపాదనపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.