Ghatkesar: ఘట్‌కేసర్ సర్కిల్‌లో ఎంఎంసీ కమిషనర్ విస్తృత పర్యటన!
Ghatkesar: ప్రజలకు నాణ్యమైన పౌర సేవలు అందించడమే లక్ష్యంగా ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలో మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కృష్ణారెడ్డి విస్తృతంగా పర్యటించారు.
Ghatkesar: ఘట్‌కేసర్ సర్కిల్‌లో ఎంఎంసీ కమిషనర్ విస్తృత పర్యటన!
Ghatkesar: ప్రజలకు నాణ్యమైన పౌర సేవలు అందించడమే లక్ష్యంగా ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. పారిశుధ్య సమస్యలు, జనగణన ప్రక్రియ, పారిశుధ్య కార్మికుల సంక్షేమం, క్రీడా మైదానాల అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యక్షంగా పరిశీలించి సంబంధిత అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. మొదటగా ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని పలు కాలనీల్లో పారిశుధ్య పరిస్థితులను పరిశీలించిన కమిషనర్, చెత్త సేకరణ, కాలువల శుభ్రత, మురుగునీటి నిల్వ వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. అనంతరం ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో కొనసాగుతున్న జనగణన (Census Enumeration) ప్రక్రియను పరిశీలించారు. ప్రతి ఇంటి వివరాలను ఖచ్చితంగా నమోదు చేసి పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేయాలని జనగణన సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా SWG (Sanitary Workers Group) కార్మికులతో సమావేశమైన కమిషనర్, నగర పరిశుభ్రతలో పారిశుధ్య కార్మికుల సేవలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. వారి ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ గ్లౌజులు, మాస్కులు, షూస్, రిఫ్లెక్టివ్ జాకెట్లు వంటి అన్ని రకాల సేఫ్టీ గేర్‌ను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
తదుపరి ఎదులాబాద్ లోని ఊర్వైగడ్డ ప్లేగ్రౌండ్‌ను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. క్రీడాకారులు, యువత, స్థానిక ప్రజలకు అవసరమైన తాగునీరు, లైటింగ్, పరిశుభ్రత, కూర్చునే సదుపాయాలు వంటి ప్రాథమిక వసతులను త్వరితగతిన కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఘట్ కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణి, ఇంజనీరింగ్ విభాగం డీఈ నరేష్, శానిటేషన్ విభాగం డీఈ శ్రీనివాస్, ఏఈఈ చంద్రశేఖర్‌తో పాటు సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




