Ghatkesar: యమ్నంపేటలో MMC కమిషనర్ వినయ్‌ కృష్ణారెడ్డి పర్యటన!

Ghatkesar: ఘట్‌కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ యమ్నంపేటలో MMC కమిషనర్ వినయ్‌ కృష్ణారెడ్డి పర్యటించి తాగునీరు, రోడ్లు, కేబుల్ వైర్ల సమస్యలపై స్థానికుల విజ్ఞతులను స్వీకరించారు.

KARUNAKAR, UPPAL
Published on: 18 Nov 2026 11:46 AM IST
Ghatkesar
X

Ghatkesar: యమ్నంపేటలో MMC కమిషనర్ వినయ్‌ కృష్ణారెడ్డి పర్యటన!

Ghatkesar: యమ్నంపేటలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని స్థానికులు మల్కాజిగిరి నగరపాలక సంస్థ కమిషనర్‌ వినయ్‌ కృష్ణారెడ్డికి విన్నవించారు. బుధవారం మల్కాజిగిరి నగరపాలక సంస్థ ఘట్‌కేసర్‌ సర్కిల్‌ పరిధిలోని పోచారం డివిజన్‌ యమ్నంపేటలో ఆయన పర్యటించి స్థానిక పరిస్థితులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఇటీవల నిర్మించిన కొత్త రోడ్లను తనిఖీ చేశారు. రోడ్ల వెంట విద్యుత్‌ స్తంభాలపై చిందరవందరగా వేలాడుతున్న కేబుల్‌ వైర్లను గమనించిన కమిషనర్‌ వాటి క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్‌ వాణికి సూచించారు.

కేబుల్‌ సంస్థల ప్రతినిధులను పిలిచి మాట్లాడి, వైర్లను క్రమపద్ధతిలో ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం స్థానికులు కాలనీలో నెలకొన్న సమస్యలను కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారిందని, కృష్ణా జలాలు కనీసం నాలుగు రోజులకు ఒకసారి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే కొన్ని కాలనీల్లో వీధి దీపాలు లేకపోవడం, మరికొన్ని ప్రాంతాల్లో రోడ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. స్పందించిన కమిషనర్‌ వెంటనే వాటర్‌బోర్డు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి యమ్నంపేటలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.

ఇతర అభివృద్ధి పనులు కూడా చేపడతామని స్థానికులకు హామీ ఇస్తూ, సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఈ పర్యటనలో డిప్యూటీ కమిషనర్‌ వాణి, టౌన్‌ ప్లానింగ్‌ ఏసీపీ శ్రీధర్‌, ఇంజినీరింగ్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL