Hayathnagar: హయత్‌నగర్ డిగ్రీ కళాశాల - హెరిటేజ్ శాఖ మధ్య చారిత్రాత్మక ఒప్పందం!
Hayathnagar: చారిత్రక సంపద పరిరక్షణ, పురావస్తు పరిశోధనల కోసం హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, తెలంగాణ హెరిటేజ్ శాఖల మధ్య 5 ఏళ్ల పాటు అమల్లో ఉండే కీలక ఒప్పందం.
Hayathnagar: హయత్‌నగర్ డిగ్రీ కళాశాల - హెరిటేజ్ శాఖ మధ్య చారిత్రాత్మక ఒప్పందం!
Hayathnagar: తెలంగాణ రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపద పరిరక్షణ, పురావస్తు పరిశోధన, వారసత్వ విద్యతో పాటు విద్యార్థుల్లో హెరిటేజ్‌పై అవగాహన పెంపొందించే దిశగా హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్ర విభాగం మరియు తెలంగాణ ప్రభుత్వ హెరిటేజ్ శాఖ మధ్య కీలకమైన అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది.
తెలంగాణలోని చారిత్రక, పురావస్తు, వారసత్వ, పర్యాటక ప్రదేశాల ప్రాధాన్యతను విద్యార్థులకు పరిచయం చేయడం, వాటి పరిరక్షణపై అవగాహన కల్పించడం, పురావస్తు విజ్ఞానాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి.
తెలంగాణ ప్రభుత్వ హెరిటేజ్ శాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్ర విభాగానికి చెందిన డా. నోముల వెంకటేశ్వర్లు, తెలంగాణ ప్రభుత్వ హెరిటేజ్ శాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్ రావు కుతాడి పాల్గొని అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ MoUలో భాగంగా కళ, పురావస్తు శాస్త్రం, వాస్తుశిల్పం, వాణిజ్య మార్గాలు, తెలంగాణలోని వారసత్వ ప్రదేశాలు తదితర అంశాలపై విద్యార్థులతో స్వల్పకాలిక పరిశోధనా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పురావస్తు ప్రాజెక్టులు, సెమినార్లు, సదస్సులు, తవ్వకాలు, పరిరక్షణ పద్ధతులు, వారసత్వ పరిశోధనల డాక్యుమెంటేషన్‌లో విద్యార్థులను భాగస్వాములను చేయనున్నారు.
హెరిటేజ్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు పురావస్తు తవ్వకాల ప్రాజెక్టుల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు, సాంకేతిక పరిజ్ఞానం, నిపుణుల సహకారం, సెమినార్లు, వర్క్‌షాప్‌లు, సదస్సులు, ప్రదర్శనలు, శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పించనున్నారు. ప్రతి సెమిస్టర్‌లో ఒకసారి మ్యూజియంలను సందర్శించే అవకాశం కూడా కల్పించనున్నారు.
అదేవిధంగా వారసత్వ భవనాల గుర్తింపు, పరిరక్షణ, సంరక్షణకు అవసరమైన సూచనలు మరియు సాంకేతిక మార్గదర్శకాలను అందించనున్నారు. ఈ అవగాహన ఒప్పందం సంతకం చేసిన తేదీ నుంచి ఐదు సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ పి. సురేష్ బాబు, చరిత్ర విభాగ అధ్యాపకులు డా. ఎస్. గంగాధర్, ప్రొఫెసర్ నాగేంద్రలను అభినందించారు.
ఈ భాగస్వామ్యం ద్వారా విద్యార్థులకు పురావస్తు శాస్త్రం, వారసత్వ పరిరక్షణ, పరిశోధన, పర్యాటక రంగాల్లో ప్రత్యక్ష అనుభవం లభించడంతో పాటు, తరగతి గది విద్యను తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వనరులతో అనుసంధానం చేసే అవకాశం ఏర్పడుతుందని కళాశాల వర్గాలు పేర్కొన్నాయి.
తెలంగాణ వారసత్వ సంపదను డాక్యుమెంట్ చేయడం, పరిరక్షించడం, సంరక్షించడం, భవిష్యత్ తరాలకు పరిచయం చేయడం పట్ల విద్యార్థుల్లో బాధ్యతాయుతమైన అవగాహన పెంపొందించేందుకు ఈ MoU దోహదపడనుంది.




