Nagole: నాగోల్‌లో 72 అడుగుల భారీ పర్యావరణహిత గణపతి!

Nagole: ఖైరతాబాద్‌ను మించిన మట్టి గణనాథుడు: నాగోల్‌లో 72 అడుగుల భారీ పర్యావరణహిత విగ్రహం. సందర్శించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్, సీపీ సుమతి.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 23 Sept 2026 11:43 PM IST
Nagole
X

Nagole: నాగోల్‌లో 72 అడుగుల భారీ పర్యావరణహిత గణపతి!

నాగోల్‌: నాగోల్‌లో భక్తి.. పర్యావరణ పరిరక్షణ రెండింటినీ మేళవిస్తూ తిరంగా యూత్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన 72 అడుగుల భారీ మట్టి గణనాథుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఖైరతాబాద్‌ గణేశుడి కంటే మూడు అడుగులు ఎత్తైన ఈ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, మల్కాజ్‌గిరి పోలీస్‌ కమిషనర్‌ సుమతి, జోనల్ కమిషనర్ వికాస్ మహతో, మున్సిపల్‌ కమిషనర్‌ వినయ్‌ కృష్ణ, శ్రీనివాస్ , గంగాధర్, పంకజ తదితరులు తదితరులు దర్శించుకున్నారు.

మట్టి గణనాథుడిపై జయేశ్‌ రంజన్‌ ప్రశంసలు

ఖైరతాబాద్‌ గణేశుడిని సాధారణంగా దర్శించుకుంటామని.. అయితే నాగోల్‌లో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం దానికంటే మూడు అడుగులు ఎత్తుగా ఉందని జయేశ్‌ రంజన్‌ తెలిపారు. ఇంత భారీ విగ్రహాన్ని పూర్తిగా మట్టితో తయారు చేయడం అభినందనీయమన్నారు.

ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాల వల్ల నిమజ్జనం అనంతరం నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉందని.. తద్వారా చేపలు, ఇతర జలచరాలకు ఇబ్బందులు ఏర్పడతాయని పేర్కొన్నారు. పర్యావరణహితమైన మట్టి విగ్రహంతో భక్తిశ్రద్ధలతో పండుగ నిర్వహించడం ప్రశంసనీయమన్నారు.

శనివారం ఈ విగ్రహాన్ని ఇక్కడే పర్యావరణహితంగా నిమజ్జనం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారని జయేశ్‌ రంజన్‌ వెల్లడించారు.

నిమజ్జనానికి మున్సిపల్‌ ఏర్పాట్లు

నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ వినయ్‌ కృష్ణ తెలిపారు. రహదారులపై గుంతలను పూడ్చడం, విద్యుత్‌ వైర్లను క్రమబద్ధీకరించడం, అవసరమైన చెట్ల కొమ్మలను తొలగించడం వంటి పనులు చేపడుతున్నామని చెప్పారు.

నిమజ్జన ప్రాంతంలో క్రేన్లు, లైట్లు, ఇతర అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎలాంటి అదనపు సహాయం లేకుండానే తిరంగా యూత్‌ అసోసియేషన్‌ ఇంత భారీ మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

భారీ విగ్రహాలు ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తోనే తయారు చేయాలన్న అపోహలను ఈ గణనాథుడు తొలగిస్తున్నాడని చెప్పారు. ఇళ్లలో, అపార్ట్‌మెంట్‌ సంఘాల్లోనూ మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకోవచ్చని ఈ విగ్రహం నిరూపించిందన్నారు.

యువతకు సీపీ సుమతి అభినందనలు

తిరంగా యూత్‌ అసోసియేషన్‌ యువతను మల్కాజ్‌గిరి సీపీ సుమతి ప్రత్యేకంగా అభినందించారు. వినాయక మండపాలకు కుటుంబ సమేతంగా ప్రజలు వస్తుంటారని.. అలాంటి సందర్భాల్లో మంచి సామాజిక సందేశాలను అందిస్తే అవి కుటుంబాల్లో చర్చకు దారితీస్తాయని పేర్కొన్నారు.

నాగోల్‌లో ఏర్పాటు చేసిన 72 అడుగుల గణనాథుడు కూడా ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచే గొప్ప ఉదాహరణగా నిలుస్తున్నాడని సీపీ సుమతి అన్నారు. ముఖ్యంగా పూర్తిగా మట్టితో తయారు చేయడం ఈ విగ్రహం ప్రత్యేకత అని పేర్కొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR