Hyderabad: నకిలీ ఏఐ ఆర్మీ ఫోటోలతో యువతికి టోకరా కేటుగాడు గోవర్ధన్ అరెస్ట్

Hyderabad: ఆర్మీ అధికారినంటూ నకిలీ ఏఐ ఫోటోలతో యువతిని నమ్మించి మోసం. నిందితుడు గోవర్ధన్ అరెస్ట్, చర్లపల్లి జైలుకు తరలింపు అన్న నాగోల్ పోలీసులు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 2 July 2026 8:14 PM IST
Hyderabad
X

Hyderabad: నకిలీ ఏఐ ఆర్మీ ఫోటోలతో యువతికి టోకరా కేటుగాడు గోవర్ధన్ అరెస్ట్

హైదరాబాద్: నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెళ్లి పేరుతో యువతిని మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆనంద్‌నగర్‌కు చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, శామీర్‌పేట్‌కు చెందిన ముకేరా గోవర్ధన్ (29) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

మోసం చేసిన తీరు: నిందితుడు సోషల్ మీడియా ద్వారా బాధితురాలితో పరిచయం పెంచుకున్నాడు. తాను ఆర్మీ అధికారినని నమ్మించేందుకు నకిలీ AI ఫోటోలను ఉపయోగించాడు. బాధితురాలితో సన్నిహిత సంబంధం ఏర్పరుచుకొని ప్రేమిస్తున్నట్లు నమ్మించి, పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. అనంతరం ఆమెతో సహజీవనం చేస్తూ శారీరకంగా దుర్వినియోగం చేశాడు.

డబ్బు కాజేసి బెదిరింపు: తన తండ్రి ఆరోగ్యం బాగోలేదని చెప్పి బాధితురాలి నుంచి భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నాడు. మోసానికి పాల్పడటంతో పాటు, ఆమెను బెదిరించినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.

పోలీసుల దర్యాప్తు: దర్యాప్తులో నిందితుడికి ఇప్పటికే వివాహం జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా, గత ఏడాది ఆల్వాల్‌కు చెందిన మరో మహిళను కూడా ఇదే తరహాలో పెళ్లి పేరుతో మోసం చేసిన కేసులో అతను అరెస్టై జైలుకు వెళ్లి, ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

రిమాండ్: నిందితుడిని నాగోల్ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించి చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించినట్లు నాగోల్ ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ మక్బూల్ జానీ తెలిపారు.

పోలీసుల సూచన: సోషల్ మీడియా ద్వారా ఏర్పడే పరిచయాల విషయంలో ప్రజలు, ముఖ్యంగా యువతులు అప్రమత్తంగా ఉండాలి. గుర్తు తెలియని వ్యక్తులను నమ్మి వ్యక్తిగత వివరాలు, ఫోటోలు షేర్ చేయవద్దు. డబ్బు లావాదేవీలు చేయవద్దు. అనుమానం వస్తే వెంటనే 100 డయల్ చేయాలి లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలి.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story