Nagole: బైక్ చోరీలు, గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అరెస్ట్!
Nagole: నాగోల్ పోలీసుల అదుపులో ముగ్గురు అంతర్రాష్ట్ర చైన్ స్నాచర్లు. బైక్ చోరీలు, గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల నుంచి 5 తులాల బంగారం, బైక్ స్వాధీనం.
Nagole: బైక్ చోరీలు, గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అరెస్ట్!
Nagole: నాగోల్: ....చైన్ స్నాచింగ్‌లు, వాహన చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర నేరస్థులను నాగోల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రెండు బంగారు మంగళసూత్రాలు, బజాజ్ పల్సర్ మోటార్‌సైకిల్, నేరాలకు ఉపయోగించిన ఓపో మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన అంషు కుమార్ (26), సరోజ్ కుమార్ (23), విక్రమ్ కుమార్ (23) కూలీ పనుల కోసం ఇటీవల హైదరాబాద్‌కు వచ్చి యాకుత్‌పురాలో నివాసముంటున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ముగ్గురూ చైన్ స్నాచింగ్‌లు, వాహన చోరీలకు పాల్పడాలని కుట్ర పన్నారు.
ఆగస్టు 3న మేడ్చల్‌లోని వెల్లమ్మతోట కాలనీ వద్ద బజాజ్ పల్సర్ బైక్‌ను చోరీ చేశారు. అదే బైక్‌పై ఆగస్టు 4న నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్టి అన్నారం, ఆర్.కే.నగర్‌లో ఓ మహిళ మెడలోని బంగారు మంగళసూత్రాన్ని లాక్కెళ్లారు. ఆగస్టు 6న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామంలో మరో మహిళ మెడలోని ఐదు తులాల బంగారు మంగళసూత్రాన్ని అపహరించారు.
ఈ నేపథ్యంలో ఆగస్టు 7న ఆనంద్‌నగర్ ఎక్స్‌రోడ్డు వద్ద నాగోల్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా చైన్ స్నాచింగ్‌లు, బైక్ చోరీకి పాల్పడినట్లు అంగీకరించారు. వారి వద్ద నుంచి రెండు బంగారు మంగళసూత్రాలు, మొత్తం ఐదు తులాల బంగారం, బజాజ్ పల్సర్ బైక్, ఓపో మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
కేసును చాకచక్యంగా ఛేదించిన సీసీఎస్ ఎల్‌బీనగర్ ఇన్‌స్పెక్టర్ గోవింద్, సరూర్‌నగర్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ శేఖర్, నాగోల్ ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ మక్బూల్ జానీతో పాటు సిబ్బంది సుభాష్, సాయి, లింగస్వామి, జగన్‌లను ఎల్‌బీనగర్ డీసీపీ డా. అనురాధ, ఐపీఎస్ అభినందించారు.




