Hayathnagar: డిగ్రీ కళాశాల గ్రంథపాలకుడు డాక్టర్ దుర్గాప్రసాద్‌కు ఘన సన్మానం
Hayathnagar: మద్రాస్ లైబ్రరీ అసోసియేషన్ జాతీయ స్థాయి ఉత్తమ లైబ్రేరియన్ అవార్డు పొందిన హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల దుర్గాప్రసాద్‌ను కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది.
Hayathnagar: డిగ్రీ కళాశాల గ్రంథపాలకుడు డాక్టర్ దుర్గాప్రసాద్‌కు ఘన సన్మానం
హయత్‌నగర్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్‌నగర్‌లో గ్రంథపాలకులుగా పనిచేస్తున్న డాక్టర్ ఏ. ఆనందం దుర్గాప్రసాద్‌కు మద్రాస్ లైబ్రరీ అసోసియేషన్ ఇటీవల జాతీయ స్థాయి ఉత్తమ లైబ్రేరియన్ అవార్డును అందజేసింది. ఈ సందర్భంగా కళాశాల స్టాఫ్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం డాక్టర్ దుర్గాప్రసాద్‌ను కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి. సురేష్ బాబు మాట్లాడుతూ.. దుర్గాప్రసాద్ స్వయంగా రూపొందించిన ఈ-లైబ్రరీ తెలంగాణ బ్లాగ్ ద్వారా విద్యార్థులకు విద్య, ఉద్యోగాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన విలువైన సమాచారాన్ని నిరంతరం అందుబాటులో ఉంచుతున్నారని కొనియాడారు. విద్యార్థుల లక్ష్యసాధనకు ఆయన అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు.
జాతీయ ఉత్తమ లైబ్రేరియన్ అవార్డు గ్రహీత డాక్టర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. “Educational and Employment Information for All” అనే లక్ష్యంతో ఈ-లైబ్రరీ తెలంగాణ బ్లాగ్‌ను రూపొందించినట్లు తెలిపారు. ఈ బ్లాగ్‌ను ఇప్పటివరకు 146 దేశాల నుంచి పాఠకులు వీక్షించారని, 17 లక్షల మందికి పైగా సందర్శించారని పేర్కొన్నారు.
బ్లాగ్ ద్వారా ఎవరైనా ఎప్పుడైనా విద్య, ఉద్యోగాలు, పోటీ పరీక్షలు, ప్రవేశ పరీక్షలకు సంబంధించిన సమాచారం, గత ప్రశ్నపత్రాలు-సమాధానాలు, ప్రాక్టీస్ బిట్స్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చని తెలిపారు. కోచింగ్ లేకుండానే వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా మెటీరియల్, వీడియో ఉపన్యాసాలు అందుబాటులో ఉన్నాయని, ఉన్నత విద్య మరియు ఉద్యోగాల కోసం సిద్ధమయ్యే ప్రతి ఒక్కరూ ఈ వనరులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
స్టాఫ్ క్లబ్ సెక్రటరీ డాక్టర్ శ్రీపతి నాయుడు మాట్లాడుతూ.. దుర్గాప్రసాద్ అందిస్తున్న ఉత్తమ సేవలకు జాతీయ స్థాయి అవార్డు లభించడం ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్‌నగర్‌కు గర్వకారణమని అన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్-1 వన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్-2 శ్రీమతి ఇందిరా, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ మధు, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ బి. నరసింహ, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఈ. యాదగిరిరెడ్డి, డాక్టర్ మక్ల, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.




