Quthbullapur: హైడ్రా చెరువుల అభివృద్ధి భేష్: జాతీయ డ్యామ్ సేఫ్టీ కమిటీ కితాబు!

Quthbullapur: కుత్బుల్లాపూర్‌లోని ఫాక్స్ సాగర్ సరస్సు అభివృద్ధి, పునరుద్ధరణ పనులను జాతీయ డ్యామ్ సేఫ్టీ నిపుణుల కమిటీ పరిశీలించింది.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 21 Aug 2026 5:45 PM IST
Quthbullapur
X

Quthbullapur: హైడ్రా చెరువుల అభివృద్ధి భేష్: జాతీయ డ్యామ్ సేఫ్టీ కమిటీ కితాబు!

కుత్బుల్లాపూర్: న‌గ‌రంలో హైడ్రా చేప‌ట్టిన చెరువుల‌ పున‌రు ద్ధ‌ర‌ణ‌, అభివృద్ధి చాలా బాగుంద‌ని జాతీయ డ్యామ్ సేఫ్టీ నిపుణుల క‌మిటీ కితాబిచ్చింది. క్యాచ్‌మెంట్ ఏరియా నుంచి చెరువులోకి వ‌ర‌ద నీరు చేరేలా ఇన్‌లెట్లు, చెరువు నిండిన త‌ర్వాత కింద‌కు పోయేలా ఔట్‌లెట్ల అభివృద్ధితో పాటు.. ప‌టిష్ట‌మైన‌ బండ్‌ల నిర్మాణం.. ఇలా చెరువుకు ఉండే స‌హ‌జ‌ల‌క్ష‌ణాల‌ను ప‌రిర‌క్షిస్తూ సాగుతున్న హైడ్రా చెరువుల అభివృద్ధి దేశానికి న‌మూనా అని కొనియాడింది.

న్యూఢిల్లీకి చెందిన జాతీయ డ్యామ్ సేఫ్టీ నిపుణుల కమిటీ ఛైర్మెన్ డా. శైలేష్ కుమార్ శ్రీ‌వాస్త‌వ నేతృత్వంలోని స‌భ్యులు నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి ఫాక్స్ సాగర్ సరస్సును బుధ‌వారం సందర్శించారు. ఈ సందర్భంగా సరస్సు ప్రధాన కట్ట (మెయిన్ బండ్)ను పరిశీలించి, సరస్సు ప్రస్తుత పరిస్థితి, కట్ట భద్రతకు సంబంధించిన అంశాలను స‌మీక్షించారు. ఫాక్స్ సాగర్ సరస్సు FTL పరిధి 482.6 ఎకరాలు కాగా, సరస్సు పరిరక్షణ, పునరుద్ధరణకు సంబంధించి HYDRAA రూపొందించిన ప్రణాళికను విమోస్ టెక్నోక్రాట్స్ డైరెక్ట‌ర్ యూన‌స్ గారు వివరించారు.

సరస్సు సరిహద్దుల పరిరక్షణ, ప్రజా ఆస్తుల రక్షణ, పర్యావరణ పరిరక్షణతో పాటు భవిష్యత్ అభివృద్ధి చర్యలపై వారికి తెలిపారు. HYDRAA ఫేజ్-3లో పెద్ద సరస్సుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఫాక్స్ సాగర్ సరస్సును అభివృద్ధి చేస్తున్నామ‌న్నారు. చెరువు పున‌రుద్ధ‌ర‌ణ‌, సంరక్షణ, నీటి నిల్వ సామర్థ్యాన్ని కాపాడటం, సరస్సు పరిసరాలను పరిరక్షించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నామ‌ని చెప్పారు.

ప్రజా ఆస్తుల పరిరక్షణతో పాటు చెరువులు, సరస్సుల పునరుద్ధరణకు HYDRAA చేపడుతున్న కార్యక్రమాలను జాతీయ డ్యామ్ సేఫ్టీ నిపుణుల కమిటీ సభ్యులు అభినందించారు. హైదరాబాద్‌లోని సరస్సులను పరిరక్షించేందుకు, భవిష్యత్ తరాలకు వాటిని సురక్షితంగా అందించేందుకు HYDRAA చేస్తున్న కృషిని వారు ప్రశంసించారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story