Malkajgiri: చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలి: జ్యోతి!

Malkajgiri: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి డిమాండ్ చేశారు.

Bodike Manohar, Malkajgiri
Published on: 7 Oct 2026 4:33 PM IST
Malkajgiri
X

Malkajgiri: చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలి: జ్యోతి!

మల్కాజిగిరి, అక్టోబరు 7: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను తక్షణమే అమలు చేయాలని భారత జాతీయ మహిళా సమాఖ్య తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం వినాయక్‌నగర్‌లోని సీపీఐ కార్యాలయంలో మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి మండల మహిళా సమాఖ్య మహాసభ నిర్వహించారు. జిల్లా ఉపాధ్యక్షురాలు రొయ్యల గిరిజ అధ్యక్షతన జరిగిన ఈ మహాసభకు ముఖ్య అతిథిగా నేదునూరి జ్యోతి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డీలిమిటేషన్ పేరుతో నియోజకవర్గాల పునర్విభజనను కారణంగా చూపుతూ చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలును ఆలస్యం చేయడం సరికాదన్నారు. పార్లమెంటు, శాసనసభలు తదితర చట్టసభల్లో మహిళల జనాభా ప్రాతిపదికన కనీసం 33 శాతం ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థలు, రాజకీయ పార్టీలు, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లోనూ మహిళలకు జనాభా ఆధారంగా ప్రాతినిధ్యం కల్పించాలన్నారు.

పితృస్వామ్య వ్యవస్థ నిర్మూలనతోనే మహిళల హక్కులు, సమానత్వం సాధ్యమవుతాయని నేదునూరి జ్యోతి పేర్కొన్నారు. మహిళల రక్షణ, హక్కుల కోసం చట్టాలు ఉన్నప్పటికీ వాటి అమలులో మరింత చిత్తశుద్ధి అవసరమన్నారు. మహిళలను వినియోగ వస్తువులుగా చూపించే అశ్లీల సాహిత్యం, సినిమాలు, ధారావాహికలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

మహిళా సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జె. లక్ష్మి మాట్లాడుతూ వితంతువులు, మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం అందిస్తామని ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. ఆడపిల్లల వివాహానికి తులం బంగారం, కళ్యాణలక్ష్మి పథకంలో ఇచ్చే హామీలను అమలు చేయడంతో పాటు యువతులకు స్కూటీలు ఇస్తామన్న హామీని కూడా నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

సీపీఐ మల్కాజిగిరి మండల కార్యదర్శి కాసర్ల నాగరాజు మాట్లాడుతూ యూపీఐ లావాదేవీలపై పెంచిన ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

అనంతరం మహిళా సమాఖ్య మండల కన్వీనింగ్ కమిటీని ఎన్నుకున్నారు. కన్వీనర్‌గా రొయ్యల గిరిజ, కో-కన్వీనర్లుగా పి. కళమ్మ, ఎన్. లక్ష్మిని ఎన్నుకున్నారు. సభ్యులుగా సి. సుగుణ, టి. స్వప్న ఎన్నికయ్యారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు ఉజ్జిని హైమావతి, జిల్లా ఉపాధ్యక్షురాలు ప్రమీల, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri