Kukatpally: రెస్టారెంట్ వద్ద అక్రమ పార్కింగ్.. ఎక్స్‌రోడ్‌లో నరకయాతన!
Kukatpally: కూకట్‌పల్లి నిజాంపేట్ ఎక్స్‌రోడ్ మైఫిల్ రెస్టారెంట్ వద్ద అక్రమ పార్కింగ్‌తో ఫ్రీ లెఫ్ట్ స్తంభించింది.
Kukatpally: రెస్టారెంట్ వద్ద అక్రమ పార్కింగ్.. ఎక్స్‌రోడ్‌లో నరకయాతన!
కూకట్‌పల్లి: కెపిహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేట్ ఎక్స్‌రోడ్ వద్ద మైఫిల్ రెస్టారెంట్ కారణంగా ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రెస్టారెంట్‌కు వచ్చే వాహనాలను రోడ్డుపైనే, ముఖ్యంగా ఫ్రీ లెఫ్ట్‌ను ఆక్రమించేలా పార్క్ చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. రద్దీ సమయాల్లో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించి, భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.
అంబులెన్స్‌లు, ఇతర అత్యవసర సేవల వాహనాలు కూడా ఈ ట్రాఫిక్‌లో చిక్కుకుని ఆలస్యమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై అక్రమ పార్కింగ్ జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ పార్కింగ్‌పై ప్రశ్నించిన వారితో కొందరు నిర్వాహకులు, సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిత్యం వేలాది మంది ప్రయాణించే ఈ ప్రధాన జంక్షన్‌లో ఫ్రీ లెఫ్ట్‌ను ఆక్రమించడం వల్ల ట్రాఫిక్ నిర్వహణ తీవ్రంగా దెబ్బతింటోందని వాహనదారులు చెబుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి అక్రమ పార్కింగ్‌ను వెంటనే తొలగించడంతో పాటు, రోడ్లను ఆక్రమిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఈ ప్రాంతంలో ట్రాఫిక్ శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఫ్రీ లెఫ్ట్‌ను పూర్తిగా ఖాళీ చేయించడం, రోడ్డుపై అక్రమ పార్కింగ్‌ను అరికట్టడం, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.




