Hyderabad: విశ్వవిద్యాలయంలో 25 మంది ఒగ్గు కథ కళాకారులకు సన్మానం
Hyderabad: హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఒగ్గు కథ పరిరక్షణకు గాను ‘ఒగ్గు కథ యూనివర్స్ 2026 హనర్స్’ నిర్వహించి 25 మంది ప్రముఖ జానపద కళాకారులను ఘనంగా పురస్కారాలతో సన్మానించారు.
Hyderabad: విశ్వవిద్యాలయంలో 25 మంది ఒగ్గు కథ కళాకారులకు సన్మానం
హైదరాబాద్: తెలంగాణకు చెందిన గొప్ప జానపద కళారూపమైన ఒగ్గు కథ పరిరక్షణ, ప్రాచుర్యం మరియు కళాకారుల గౌరవార్థం “ఒగ్గు కథ యూనివర్స్ 2026 హనర్స్” హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా ఎంపికైన 25 మంది ప్రముఖ ఒగ్గు కథ కళాకారులను ఎంపిక చేసి హైదరాబాద్ లోని సెంట్రల్ యూనివర్సిటీలోని సావిత్రి బాయి ఫూలే ఆడిటోరియంలో కళాకారుల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఒగ్గు కథను తరతరాలకు అందిస్తూ, ఈ సంప్రదాయ కళారూపాన్ని సజీవంగా కొనసాగిస్తున్న కళాకారులను గౌరవించడం తెలంగాణ జానపద కళా చరిత్రలో ఒక విశిష్టమైన సందర్భమని కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు అభిప్రాయపడ్డారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఈ కార్యక్రమానికి లేఖ ద్వారా తన సందేశాన్ని పంపగా సభలో చదివి వినిపించారు.
ఆయన తన సందేశంలో, “25 మంది ప్రముఖ ఒగ్గు కథ కళాకారులను సన్మానించడం అభినందనీయమైన విషయమని తెలిపాయి. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రొఫెసర్ జాలీ పుతుశ్శేరి మరియు డా. జి. కుమారస్వామిలకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రియాంక, హైదరాబాద్ విశ్వవిద్యాలయం మాస్ కమ్యూనికేషన్ విభాగానికి చెందిన, శిర్తా వ్యాఖ్యాతలుగా వ్యవహరించి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హోటల్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్, ప్రొఫెసర్ వెంకట రమణ, శ్రీకో ప్రాజెక్ట్స్ ఛైర్మన్ మెచినేని శ్రీనివాసరావు, ప్రముఖ సినీ నటుడు బలగం సుధాకర్ రెడ్డి, జ్యోతి రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. జ్యోతి రెడ్డి దుడిపాల, హైదరాబాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మీడియా ఆర్ట్స్ హెడ్,జీ డా. జి. కుమారస్వామి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. రావుల కృష్ణ, హైదరాబాద్ విశ్వవిద్యాలయం; ప్రొఫెసర్ జాలీ పుతుశ్శేరి, హెడ్, సెంటర్ ఫర్ ఫోక్ కల్చర్ స్టడీస్, హైదరాబాద్ విశ్వవిద్యాలయం; ప్రముఖ టెలివిజన్ నటుడు విజయ్ యాదవ్; శివ పాలేపు, అధ్యక్షుడు, స్టూడెంట్ యూనియన్, హైదరాబాద్ విశ్వవిద్యాలయం, సింగారపు రాజ్ కుమార్, సెలక్షన్ కమిటీ హెడ్, తెలంగాణ రచయిత, కవి ప్రవీణ్ మాచవరం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులందరూ నిర్వాహకులను అభినందిస్తూ, తెలంగాణ జానపద కళాకారులకు గుర్తింపు కల్పించడం, రాష్ట్ర జీవన సాంస్కృతిక వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు పరిరక్షించడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మరో ప్రధాన ఆకర్షణగా “గాడ్స్ ఇన్ ది వాయిస్” అనే ఒగ్గు కథపై రూపొందించిన ఆంగ్ల భాషలో తొలి డాక్యుమెంటరీ చిత్రాన్ని ప్రదర్శించారు. ఒగ్గు కథలోని కళాత్మక వైభవం, సాంస్కృతిక ప్రాధాన్యతను సమగ్రంగా ఆవిష్కరించిన ఈ డాక్యుమెంటరీకి విశేష ప్రశంసలు లభించాయి. సంప్రదాయ ఒగ్గు కథ కళారూపాన్ని డాక్యుమెంటరీ చిత్రీకరణ ద్వారా విస్తృత ప్రేక్షకులకు చేరువ చేసినందుకు డా. కుమారస్వామి జి. మరియు ఆయన బృందాన్ని అతిథులు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమానికి ముందు నిర్వహించిన బతుకమ్మ వర్క్‌షాప్‌లో 30 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం పీహెచ్‌డీ పరిశోధకులు వసుమతి, తేజస్విని, శ్రీనిక, రజిత, కవిత, సుప్రజ తదితరుల చురుకైన భాగస్వామ్యంతో ఈ వర్క్‌షాప్ నిర్వహించారు. బతుకమ్మకు సంబంధించిన సాంస్కృతిక సంప్రదాయాలను విద్యార్థులు ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటితో అనుసంధానమయ్యే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా లభించింది.
కార్యక్రమ నిర్వహణలో పీహెచ్‌డీ పరిశోధకుడు సుమంత్ పెండెం చురుకైన పాత్ర పోషించారు. “ఒగ్గు కథ యూనివర్స్ 2025 హనర్స్” విజయవంతంగా ముగియడం ద్వారా ఒగ్గు కథ కళాకారులకు మరింత విస్తృతమైన గుర్తింపు కల్పించే దిశగా ఒక ముఖ్యమైన ముందడుగు పడింది. తెలంగాణ సాంస్కృతిక గుర్తింపులో ఒగ్గు కథ ఒక సజీవమైన, వైవిధ్యభరితమైన, శక్తివంతమైన జానపద కళారూపంగా కొనసాగుతోందని ఈ కార్యక్రమానికి మెచినేని శ్రీనివాస రావు ట్రస్ట్ మరియు తెలంగాణ యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ రఘునాథ్ యాదవ్ సహకారం అందించారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు నిర్వహకులు తెలిపారు.




