Osmania University: అధ్యాపకుల కొరతపై ఓయూ విద్యార్థుల వినూత్న ఆందోళన

Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న 941 అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో "రోడ్డుపై చదువు" నిరసన చేపట్టారు.

HARISH, TARNAKA
Published on: 3 July 2026 2:50 PM IST
Osmania University
X

Osmania University: అధ్యాపకుల కొరతపై ఓయూ విద్యార్థుల వినూత్న ఆందోళన

Osmania University: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉస్మానియా యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ వినూత్నంగా "రోడ్డుపై చదువు" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు రోడ్డుపైనే కూర్చొని తరగతులు నిర్వహిస్తూ, ప్రొఫెసర్ల కొరత కారణంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రతీకాత్మకంగా ప్రదర్శించారు.

ఈ సందర్భంగా ఎబివిపి ఓయూ అధ్యక్షులు గెల్లు శేఖర్ మరియు కార్యదర్శి మోక్షిత్ మాట్లాడుతూ, 100 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ నేడు అధ్యాపకుల కొరతతో తీవ్ర విద్యా సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీలో దాదాపు 941 టీచింగ్ మరియు నాన్-టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉండటంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని తెలిపారు.

పలు విభాగాల్లో శాశ్వత ప్రొఫెసర్లు లేకపోవడంతో అతిథి అధ్యాపకులపైనే విద్యా బోధన కొనసాగుతోందని, దీనివల్ల బోధన, పరిశోధన, విద్యా ప్రమాణాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యాభివృద్ధి గురించి మాటల్లో కాకుండా ఆచరణలో చూపించాలని, వెంటనే ప్రొఫెసర్ నియామక ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిష్ఠను కాపాడాలంటే ఖాళీ పోస్టులను భర్తీ చేసి, విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు మరియు నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఎబీవీపీ ఆధ్వర్యంలో మరింత ఉధృతమైన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిటీ సెక్రటరీ పృథ్వితేజ, స్టేట్ జాయింట్ సెక్రెటరీ అలివేలు రాజు, విద్యానగర్ విభాగ్ కన్వీనర్ హరిప్రసాద్,సిటీ జాయింట్ సెక్రెటరీ దినేష్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ తన్మై,నితిన్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA

Next Story