Osmania University: అమరవీరుల ఆశయ సాధనకు విద్యార్థులు పోరాడాలి
Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలో జంపాల చంద్రశేఖర ప్రసాద్, శ్రీపాద శ్రీహరి 50వ వర్ధంతి సభను PDSU ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి, అమరవీరులకు నివాళులర్పించారు.
Osmania University: అమరవీరుల ఆశయ సాధనకు విద్యార్థులు పోరాడాలి
ఉస్మానియా యూనివర్సిటీ: జంపాల చంద్రశేఖర ప్రసాద్, శ్రీపాద శ్రీహరి అమరత్వ స్ఫూర్తితో సమసమాజ స్థాపన, శాస్త్రీయ విద్యాసాధన కోసం విద్యార్థులు ఉద్యమించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. PDSU తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ఈసీజీ ఆడిటోరియంలో వారి 50వ వర్ధంతి సభ నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు పి. మహేష్ అధ్యక్షతన జరిగిన సభలో అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఏ. వినయ్ బాబు మాట్లాడుతూ.. జంపాల చంద్రశేఖర ప్రసాద్, శ్రీపాద శ్రీహరి వంటి విప్లవ విద్యార్థి నాయకుల త్యాగాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. వారి ఆశయాలను కొనసాగిస్తూ విద్యార్థి హక్కుల కోసం, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
PDSU పూర్వ రాష్ట్ర అధ్యక్షులు బి. ప్రదీప్, సాదినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. విద్యార్థి ఉద్యమం క్యాంపస్ సమస్యలకే పరిమితం కాకుండా సామాజిక అసమానతలు, దోపిడీ, వివక్షకు వ్యతిరేకంగా సాగాలని అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలకు నిధులు కేటాయించాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, ప్రైవేటీకరణను అరికట్టాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకుని సమాజ మార్పు కోసం ఉద్యమాల్లో భాగస్వాములు కావాలన్నారు.
ఈ కార్యక్రమంలో PDSU రాష్ట్ర ఉపాధ్యక్షులు బోనగిరి మధు, జన్నారపు రాజేశ్వర్, డి. శ్రీకాంత్, కె. రాణా ప్రతాప్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు ఆర్. గౌతమ్ కుమార్, జి. మస్తాన్, మంద నవీన్, రాష్ట్ర నాయకులు, ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




