Hyderabad: ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో వైభవంగా బతుకమ్మ వేడుకలు!
Hyderabad: ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో బతుకమ్మ వేడుకలు. హాజరైన వీసీ ప్రొఫెసర్ కుమార్, ప్రిన్సిపల్ కాశీం. తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ ప్రతీక అని వెల్లడి.
Hyderabad: ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో వైభవంగా బతుకమ్మ వేడుకలు!
Hyderabad: హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ వైస్ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశీం హాజరయ్యారు. అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు, ప్రజల వ్యక్తిత్వానికి ప్రతీక అని అన్నారు. ఇది కేవలం పూల పండుగ మాత్రమే కాదని, ప్రకృతితో మానవ సంబంధాన్ని చాటిచెప్పే ప్రత్యేకమైన పండుగ అని పేర్కొన్నారు. ప్రకృతిలో విరబూసే వివిధ రకాల రంగురంగుల పూలను సేకరించి బతుకమ్మను రూపొందించడం తెలంగాణ ప్రత్యేకత అని వివరించారు.
ప్రకృతిలో గునుగు పూలతో పాటు వివిధ రకాల పూలు సమృద్ధిగా లభించేలా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కాలుష్యరహిత వాతావరణాన్ని కాపాడుకుంటూ, పక్షులు స్వేచ్ఛగా విహరించే ఆహ్లాదకరమైన ప్రకృతిని భవిష్యత్ తరాలకు అందించాలని పిలుపునిచ్చారు. ప్రకృతి పరిరక్షణపై అవగాహన పెంపొందించుకుంటూ ప్రతి ఒక్కరూ సంతోషంగా బతుకమ్మ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.




