Hyderabad: ప్యారక్వట్ నిషేధం రైతు ప్రాణాలను కాపాడే నిర్ణయం కోదండరెడ్డి
Hyderabad: ప్యారక్వట్ గడ్డి మందుపై కేంద్రం నిషేధం పట్ల కోదండరెడ్డి హర్షం. తెలంగాణ ప్రభుత్వ చొరవ వల్లే దేశవ్యాప్త నిషేధానికి మార్గం సుగమమైందని వెల్లడి.
hyderabad: ప్యారక్వట్ నిషేధం రైతు ప్రాణాలను కాపాడే నిర్ణయం కోదండరెడ్డ
హైదరాబాద్: ప్యారక్వట్ (గడ్డి మందు)పై కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిషేధం విధించడం రైతుల ప్రాణాలను కాపాడే కీలక నిర్ణయమని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. తెలంగాణలో ముందుగా ఈ గడ్డి మందుపై తాత్కాలిక నిషేధం అమలు చేయడంతో పాటు కమిషన్ చేసిన విజ్ఞప్తులు, వైద్య నిపుణుల నివేదికల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిషేధ నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు.
హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ కార్యాలయంలో కమిషన్ సభ్యులు సునీల్, గోపాల్ రెడ్డి, రాములు నాయక్‌లతో కలిసి నిర్వహించిన సమావేశంలో కోదండరెడ్డి మాట్లాడారు. కూలీల కొరత, పశుసంపద తగ్గిపోవడంతో పొలాల్లో గడ్డిని తొలగించేందుకు రైతులు ప్యారక్వట్‌ను విస్తృతంగా వినియోగించడం ప్రారంభించారని చెప్పారు. అయితే ఈ మందు వాడకం వల్ల భూమి సారం తగ్గడంతో పాటు మానవ ప్రాణాలకు తీవ్ర ముప్పు ఏర్పడిందన్నారు.
ప్యారక్వట్ వల్ల అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, ఇది రైతుల ప్రాణాలను కూడా బలితీస్తోందని ఓ వైద్యుడు కమిషన్ దృష్టికి తీసుకురావడంతో ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించామని కోదండరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో గత మార్చి 16న ముఖ్యమంత్రిని కలిసి రాష్ట్రంలో ఈ మందును నిషేధించాలని విజ్ఞప్తి చేశామని, అనంతరం ముఖ్యమంత్రి ఆరోగ్యశాఖ మంత్రితో చర్చించి అసెంబ్లీలో ప్యారక్వట్‌పై తాత్కాలిక నిషేధాన్ని ప్రకటించారని గుర్తుచేశారు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల ఆధారంగా వైద్య నిపుణుల బృందం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించడంతో దేశవ్యాప్తంగా నిషేధం అమలుకు మార్గం సుగమమైందన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి దేశ రైతాంగం తరఫున, కమిషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్యారక్వట్ కారణంగా 4,252 మంది, తెలంగాణలో 200 మందికి పైగా మృతి చెందినట్లు కమిషన్ దృష్టికి వచ్చిందని కోదండరెడ్డి తెలిపారు.
లైసెన్స్ లేకుండానే ఆన్‌లైన్‌లో కూడా ఈ మందు విక్రయాలు జరిగాయని, మల్టీనేషనల్ కంపెనీలకు నోటీసులు జారీ చేసి విక్రయాలు నిలిపివేయాలని హెచ్చరించామని పేర్కొన్నారు.
స్విట్జర్లాండ్‌లో తయారయ్యే ఈ మందు అక్కడే నిషేధించబడిందని ఆయన తెలిపారు. కలుపు మందులు, హెచ్‌డీబీటీ పత్తి విత్తనాల వల్ల కూడా భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించిన కోదండరెడ్డి, సంప్రదాయ పద్ధతుల్లో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ప్రత్యేక దృష్టి సారిస్తుందని వెల్లడించారు. గడ్డిని తొలిగించేందుకు యంత్రాలు అందుబాటులో ఉన్నాయని , వాటిపై 40 శాతం సబ్సిడీ ను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని , దానిని రైతులు వినియోగించుకోవాలని ఛైర్మెన్ కోదండరెడ్డి విజ్ఞప్తి చేశారు.




