Pargi: పరిగి హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు!

Pargi: పరిగి హత్య కేసులో సంచలన తీర్పు: మహిళపై కిరోసిన్ పోసి చంపిన నిందితుడు దేవదాసుకు జీవిత ఖైదు, రూ.లక్ష జరిమానా. వికారాబాద్ కోర్టు జడ్జి ప్రదీప్ నాయక్ తీర్పు.

WAZID, PARIGI
Published on: 23 Sept 2026 11:38 PM IST
Pargi
X

Pargi: పరిగి హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు!

PARGI: పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో నిందితుడు రావులగల్ల దేవదాసు అలియాస్ దాసుకు జీవిత ఖైదుతో పాటు రూ.1 లక్ష జరిమానా విధిస్తూ వికారాబాద్ I అదనపు జిల్లా & సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ప్రదీప్ నాయక్ తీర్పు వెలువరించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. పరిగి మండలం చిట్యాల్ గ్రామానికి చెందిన బ్యాగరి కమల, భర్త మృతి చెందడంతో తన కుమార్తెతో కలిసి జీవించేది. అదే గ్రామానికి చెందిన దేవదాసుతో ఆమెకు పరిచయం ఉండేది.

అయితే కొన్ని కారణాలతో గతంలోనే తన ఇంటికి రావద్దని కమల దేవదాసును హెచ్చరించింది. అయినప్పటికీ దేవదాసు తరచూ మద్యం సేవించి ఆమె ఇంటికి వచ్చి గొడవపడేవాడని పోలీసులు తెలిపారు.

2016 సెప్టెంబర్ 12న రాత్రి మద్యం మత్తులో కమల ఇంటికి వెళ్లిన దేవదాసు ఆమెతో గొడవపడి.. కక్షతో కమలపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. మంటలు అంటుకున్న కమల కేకలు వేస్తూ నిందితుడి వైపు పరిగెత్తడంతో అతడికి కూడా మంటలు అంటుకున్నాయి.

తీవ్రంగా గాయపడిన కమలను తొలుత ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సెప్టెంబర్ 14న కమల మృతి చెందింది.

ఈ ఘటనపై పరిగి పోలీస్ స్టేషన్‌లో Cr.No.216/2016, సెక్షన్ 302 IPC కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాక్షుల వాంగ్మూలాలు, వైద్యపరమైన ఆధారాలు, సంఘటనకు సంబంధించిన వస్తువులు, ఇతర సాక్ష్యాలను సేకరించి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.

కేసులో సమర్పించిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన న్యాయస్థానం.. నిందితుడిపై నేరం రుజువైనట్లు నిర్ధారించింది. దీంతో రావులగల్ల దేవదాసుకు జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.1,00,000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.

ఈ కేసులో దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూషన్ సిబ్బంది, కోర్టు లైజన్ అధికారులు సమన్వయంతో పనిచేసినందుకు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా IPS వారిని అభినందించారు.

WAZID, PARIGI

WAZID, PARIGI