Pargi: కనిపించని 100 రూపాయల బాండ్ పేపర్లు.. ఆరు నెలలుగా సామాన్యుల తిప్పలు!

Pargi: వికారాబాద్ జిల్లా పరిగి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గత ఆరు నెలలుగా ₹100 బాండ్ పేపర్ల కొరత తీవ్రంగా మారింది.

WAZID, PARIGI
Published on: 5 Jun 2026 8:58 PM IST
Pargi
X

Pargi: కనిపించని 100 రూపాయల బాండ్ పేపర్లు.. ఆరు నెలలుగా సామాన్యుల తిప్పలు!

Pargi: నిత్యం వందలాది మంది సందర్శించే పరిగి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇప్పుడు బాండ్ పేపర్ల కష్టాలు మొదలయ్యాయి. గత ఆరు నెలలుగా వంద రూపాయల బాండ్ పేపర్లు దొరకక సామాన్యులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అసలు ఈ కొరత ఎందుకు?

"పరిగి పట్టణంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చే సామాన్యులకు వంద రూపాయల బాండ్ పేపర్ కోసం చుక్కలు కనిపిస్తున్నాయి. గత ఆరు నెలలుగా బాండ్ పేపర్లు అందుబాటులో లేకపోవడంతో, అవసరమైన వారు కనీసం 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న చేవెళ్ల లేదా వికారాబాద్ వెళ్లాల్సి వస్తోంది. ఇది ఒక పూట పనిని రోజంతా మార్చేస్తోంది."

"అయితే, ప్రభుత్వ కార్యాలయంలో దొరకని ఈ 100 రూపాయల బాండ్ పేపర్లు, బయట మాత్రం 500 రూపాయలకు లభిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 'బ్లాక్'లో వీటిని వికారాబాద్ లేదా చేవెళ్ల నుండి తెప్పించి, సామాన్యుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని భారీగా వసూలు చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంలో బాండ్ పేపర్లు లేవని చెబుతున్న అధికారులు, అదే సమయంలో ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఎలా దొరుకుతున్నాయని ప్రజలు నిలదీస్తున్నారు."

"ఏ చిన్న అగ్రిమెంట్ చేయాలన్నా, అఫిడవిట్ రాసుకోవాలన్నా వంద రూపాయల బాండ్ పేపర్ తప్పనిసరి. అలాంటిది కార్యాలయంలో స్టాక్ లేదనడం విడ్డూరంగా ఉందని ప్రజలు వాపోతున్నారు. సమయం వృధా అవ్వడమే కాకుండా, అదనపు భారం పడుతోందని వారు ఆందోళన చెందుతున్నారు."

"నిత్యావసరమైన బాండ్ పేపర్లను అందుబాటులో ఉంచాల్సిన అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? దీని వెనుక ఉన్న మాఫియా ఎవరు? అధికారులు ఇప్పటికైనా స్పందించి పరిగి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో బాండ్ పేపర్ల కొరతను తీర్చి, సామాన్యులను ఇబ్బందుల నుండి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

అయితే, ఈ సమస్యపై పరిగి సబ్-రిజిస్ట్రార్ శ్రీనివాస్ గారిని వివరణ కోరగా.. 'మేము బాండ్ పేపర్ల కోసం స్టాక్ పెట్టాము, కానీ ప్రభుత్వ కార్యాలయంలోకి సరఫరా రావడం లేదు' అని ఆయన పేర్కొన్నారు. స్టాక్ రాకపోవడంతోనే ప్రజలకు అందుబాటులో ఉంచలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు.

WAZID, PARIGI

WAZID, PARIGI

Next Story