Pocharam: సాయినాథ్‌గౌడ్ గురుస్వామికి 'అన్నపూర్ణ పురస్కారం' ప్రదానం
Pocharam: పోచారం యంనంపేట్‌కు చెందిన పోలగొని సాయినాథ్‌గౌడ్ గురుస్వామికి పందల రాజవంశీయుల చేతుల మీదుగా అన్నపూర్ణ పురస్కారం లభించింది.
Pocharam: సాయినాథ్‌గౌడ్ గురుస్వామికి 'అన్నపూర్ణ పురస్కారం' ప్రదానం
పోచారం: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని యంనంపేట్ కు చెందిన పోలగొని సాయినాథ్‌గౌడ్ గురుస్వామికి అరుదైన గౌరవం దక్కింది. చిక్కడపల్లిలో నిర్వహించిన ‘స్వామియే శరణమయ్యప్ప మహాశాస్త్ర సేవా సంఘం అన్నపూర్ణ పురస్కార ప్రధానోత్సవం–2026’లో పందల రాజవంశీయులు శ్రీ శ్రీ శ్రీ రాజ తిరునాళ్ సురేష్ వర్మ రాజా చేతుల మీదుగా ఆయన ఘనంగా సత్కారం అందుకున్నారు.
అన్నదానం మహాదానం అనే సనాతన ధర్మ సంప్రదాయాన్ని ఆచరణలో పెడుతూ, సమాజ సేవను జీవిత ధ్యేయంగా చేసుకుని సాయినాథ్‌గౌడ్ గురుస్వామి చేస్తున్న సేవలను ఈ సందర్భంగా అభినందించారు. యంనంపేట్ ప్రాంతం నుంచి అయ్యప్ప స్వామి సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ భక్తి, సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్న ఆయనకు ఈ గౌరవం దక్కడం పట్ల స్థానిక అయ్యప్ప భక్తులు హర్షం వ్యక్తం చేశారు.
అయ్యప్ప స్వామిని బాల్యంలో పెంచి, పందల రాజకుమారునిగా తీర్చిదిద్దిన పందల రాజవంశానికి చెందిన సురేష్ వర్మ రాజా తొలిసారిగా తెలంగాణకు విచ్చేసిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయ్యప్ప స్వామి 108 అష్టోత్తరాల సంఖ్యకు అనుగుణంగా నాలుగు రాష్ట్రాల నుంచి ఎంపిక చేసిన 108 మంది మాన్యశ్రీ, బ్రహ్మశ్రీ గురుస్వాములను పందల రాజా చేతుల మీదుగా సత్కరించారు. కార్యక్రమంలో పలువురు గురుస్వాములు, అయ్యప్ప భక్తులు, సేవా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.




