Uppal: ద్విచక్ర వాహనాల చోరీ ముఠా అరెస్ట్: ఆరు బైకులు స్వాధీనం!
Uppal: గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన తనిఖీల్లో ఆరు బైక్‌లను చోరీ చేసిన చిన్ననాటి స్నేహితులు షేక్ అవైజ్, ఫర్హాన్‌లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Uppal: ద్విచక్ర వాహనాల చోరీ ముఠా అరెస్ట్: ఆరు బైకులు స్వాధీనం!
ఉప్పల్: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్ పోలీసులు ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, రూ.4 లక్షల విలువైన ఆరు చోరీకి గురైన ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల అరెస్టుతో ఉప్పల్ తో పాటు ఇతర ప్రాంతాల్లో నమోదైన మొత్తం ఆరు బైక్ చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. ఉప్పల్ కు చెందిన విద్యార్థి సోమా అజయ్ కుమార్ తన హోండా ఎస్పీ షైన్ మోటార్‌సైకిల్ చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేయడంతో ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో జూలై 11న ఉప్పల్ గాంధీ విగ్రహం సమీపంలో నిర్వహించిన ప్రత్యేక వాహనాల తనిఖీల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో వారు షేక్ అవైజ్ అలియాస్ ఫహాద్ (20), మొహమ్మద్ ఫర్హాన్ ఖురేషి (21)గా గుర్తించారు.
ఉప్పల్ తో పాటు ఇతర ప్రాంతాల్లో ఇళ్ల ముందు, రోడ్ల పక్కన పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడినట్లు వారు అంగీకరించారు. వారి ఒప్పుకోలు మేరకు రూ.4 లక్షల విలువైన ఆరు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితులు చిన్ననాటి స్నేహితులని, సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో చోరీలకు పాల్పడినట్లు వెల్లడైంది.
ల్యాప్‌టాప్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న షేక్ అవైజ్‌కు వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో తన స్నేహితుడు ఫర్హాన్‌తో కలిసి రాత్రి వేళల్లో పార్కింగ్‌లో ఉన్న బైకులను చోరీ చేసి విక్రయిస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సాధారణ వాహనాల తనిఖీల్లో అప్రమత్తంగా వ్యవహరించిన ఉప్పల్ పోలీసులు నిందితులను పట్టుకుని విచారించడం ద్వారా ఒకేసారి ఆరు ద్విచక్ర వాహనాల చోరీ కేసులను ఛేదించారు.
అనంతరం ఇద్దరు నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, కోర్టు వారిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించింది. ఈ కేసును ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో వై. రామలింగరెడ్డి, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ డి. రవికుమార్ పర్యవేక్షణలో డిటెక్టివ్ ఎస్‌ఐ కె. రజనీకర్తో పాటు ఉప్పల్ పోలీస్ స్టేషన్ క్రైమ్ బృందం విజయవంతంగా ఛేదించారు.




