ghatkesar: ఒక కెమెరా వంద మంది పోలీసులతో సమానం: మల్కాజిగిరి సీపీ!
ghatkesar: ఒకే రోజు 3,000 సీసీటీవీ కెమెరాలను సీపీ సుమతి ప్రారంభించారు. 'మీ సురక్ష - నేను సైతం 2.0'లో భాగంగా రాంపల్లిలో 100 కెమెరాలను ఓపెన్ చేశారు.
ghatkesar: ఒక కెమెరా వంద మంది పోలీసులతో సమానం: మల్కాజిగిరి సీపీ!
ఘట్ కేసర్: నేరాల నియంత్రణకు సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రజలకు మరింత భద్రత కల్పించాలనే లక్ష్యంతో మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ చేపట్టిన "మీ సురక్ష – నేను సైతం 2.0" కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లి డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో ఏర్పాటు చేసిన 100 సీసీటీవీ కెమెరాలను మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి సోమవారం ప్రారంభించారు.
కెమెరాల ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన "మీ సురక్ష – నేను సైతం 2.0" కార్యక్రమంలో పాల్గొన్న సీపీ సుమతి స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, భద్రతకు సంబంధించిన అంశాలను తెలుసుకున్నారు. పోలీస్-ప్రజల భాగస్వామ్యంతోనే సమాజంలో శాంతిభద్రతలు మరింత బలోపేతం అవుతాయని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీపీ సుమతి మాట్లాడుతూ, "ఒక్క సీసీటీవీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం. ప్రతి వీధి, ప్రతి కాలనీపై నిరంతర నిఘా ఉండాలంటే సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ఎంతో అవసరం.
నేరం జరిగిన వెంటనే ఆధారాలను సేకరించడంలోనే కాకుండా, నేరాలను ముందుగానే అరికట్టడంలో కూడా ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి" అని అన్నారు. "మీ సురక్ష – నేను సైతం 2.0" కార్యక్రమంలో భాగంగా మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒకే రోజు 3 వేల సీసీటీవీ కెమెరాలను ప్రారంభిస్తున్నామని సీపీ తెలిపారు.
ప్రజలు స్వచ్ఛందంగా తమ ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, వ్యాపార సంస్థలు, కాలనీల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా పోలీసులకు అమూల్యమైన సహకారం అందిస్తున్నారని ఆమె కొనియాడారు. మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం 2,45,035 సీసీటీవీ కెమెరాలు పనిచేస్తున్నాయని, ఈ ఏడాది మాత్రమే 16,339 కొత్త కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీ సహాయంతో ఈ ఏడాదిలోనే 214 కీలక కేసులను విజయవంతంగా ఛేదించినట్లు తెలిపారు.
ఈ ఏడాది ఆరు నెలలలోనే 144కేసులను డిటెక్ట్ అయినాయి. ఆధునిక సాంకేతికతను పోలీసింగ్‌లో భాగం చేస్తూ లండన్ తరహా డ్రోన్ పెట్రోలింగ్ వ్యవస్థను ఇప్పటికే ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రారంభించామని, త్వరలో కమిషనరేట్‌లోని అన్ని పోలీస్ స్టేషన్లకు డ్రోన్ పెట్రోలింగ్‌ను విస్తరిస్తామని సీపీ సుమతి వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఉప్పల్ జోన్ డీసీపీ సురేష్ కుమార్, అదనపు డీసీపీ వెంకటరమణ, మేడిపల్లి ఏసీపీ మోహన్ కుమార్, పోచారం ఇన్‌స్పెక్టర్ కనకయ్య గౌడ్, ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ బాలస్వామి, సెక్టార్ ఎస్‌ఐ నాగేశ్వర్ రావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




