Uppal: జన్మదిన వేడుకల వేళ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అరెస్టు!

Uppal: పుట్టినరోజు వేడుకల్లో భాగంగా నల్లచెరువు వైపు పాదయాత్రగా వెళ్తున్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

KARUNAKAR, UPPAL
Published on: 27 Nov 2026 4:50 PM IST
Uppal
X

Uppal: జన్మదిన వేడుకల వేళ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అరెస్టు!

ఉప్పల్‌: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు ఉప్పల్‌లో రాజకీయ వేడిని రగిలించాయి. నల్లచెరువు వద్ద వేడుకల నిర్వహణకు అనుమతులు నిరాకరించడంతో మొదలైన వివాదం శుక్రవారం అరెస్టుల వరకు వెళ్లింది. జన్మదినం సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ డివిజన్లలో వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే.. హబ్సిగూడ మీదుగా ఉప్పల్‌ రింగ్‌రోడ్డుకు చేరుకుని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి కేక్‌ కట్‌ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఎమ్మెల్యేతో కలిసి అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం నల్లచెరువు వద్దకు చేరుకుని కేక్‌ కట్‌ చేసేందుకు పాదయాత్రగా బయలుదేరిన ఎమ్మెల్యేను ఉప్పల్‌ వెజిటబుల్‌ మార్కెట్‌ సమీపంలోని హైదరాబాద్‌–వరంగల్‌ జాతీయ రహదారిపై పోలీసులు అడ్డుకున్నారు.

అప్పటికే పాదయాత్రతో రహదారిపై భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. పోలీసుల అడ్డగింతను నిరసిస్తూ ఎమ్మెల్యేతో పాటు బీఆర్‌ఎస్‌ నాయకులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం ఎమ్మెల్యేను, నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆయన నివాసానికి తరలించారు. రాజకీయ కక్షతోనే స్థానిక ఎమ్మెల్యేను నిర్బంధించే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపించారు.

మరోవైపు హైదరాబాద్‌–వరంగల్‌ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. అంతకుముందు రింగ్‌రోడ్డు వద్ద జరిగిన కేక్‌ కటింగ్‌ వేడుకలతో తార్నాక నుంచి ఉప్పల్‌ రింగ్‌రోడ్డు వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఆ తర్వాత పాదయాత్రతో రింగ్‌రోడ్డు నుంచి నల్లచెరువు వైపు ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓవైపు రాజకీయ ప్రత్యర్థులకు, మరోవైపు పోలీసులకు సవాల్‌గా జన్మదిన వేడుకల హడావుడి కొనసాగింది.

ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకుని పంపించిన అనంతరం పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వేడుకల ఏర్పాట్లు చేసిన నిర్వాహకులపై ఉప్పల్‌ పోలీసులు కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలతో ఉప్పల్‌ ప్రాంతం గులాబీమయంగా మారగా.. ఎన్నికల సమయంలో కనిపించే రాజకీయ సందడి నెలకొంది.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL