Rangareddy: బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితిపై నిరసన ధర్నా!
Rangareddy: మీర్‌పేట్ బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితిలో అన్ని వర్గాలకూ ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ గణేష్ మండపం వద్ద స్థానికుల నిరసన ధర్నా.
Rangareddy: బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితిపై నిరసన ధర్నా!
Rangareddy: బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితిలో అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ పలువురు గణేష్ మండపం వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. ఉత్సవ సమితిలో కొన్ని వర్గాల వారికే ప్రాధాన్యం ఇస్తూ బడుగు, బలహీన వర్గాల ప్రజలను దూరంగా ఉంచుతున్నారని వారు ఆరోపించారు.
ఈ సందర్భంగా బొర్రా రవి మాట్లాడుతూ.. గణనాథునికి సేవ చేసే అవకాశం అన్ని వర్గాల ప్రజలకు కల్పించాలని డిమాండ్ చేశారు. సుమారు 40 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీలో ప్రస్తుతం కొన్ని వర్గాలకు చెందిన వారే కొనసాగుతున్నారని, గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ముందుకు వెళ్లాల్సిన బాధ్యత కమిటీపై ఉందన్నారు.
ఊరిలో జరిగే అన్ని కార్యక్రమాల్లో అన్ని కులాల వారిని కలుపుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అయితే బాలాపూర్ గణేష్ ఉత్సవాల సమయంలో మాత్రం కొన్ని వర్గాల వారు మాత్రమే కలిసి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.
ఉత్సవాల నిర్వహణ ఖర్చులు, ఇతర వివరాలను గ్రామస్థులకు తెలియనివ్వడం లేదని అన్నారు. బయటి నుంచి వచ్చే భక్తులకు ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతూ.. ఊరి పండగ అయినప్పటికీ ఊర్లోని ప్రజలకు సరైన వసతులు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఈ పద్ధతిని మార్చుకొని అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని కొత్త కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
బాలాపూర్ గణేష్ లడ్డూ విషయంలో కొన్ని వర్గాల వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై కమిటీని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. హుండీ లెక్కలను బాలాపూర్ ఊర్లోని దేవాలయాల్లో లెక్కించకుండా వారి ఇంటిలో లెక్కపెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.




