Medchal: ఘట్‌ కేసర్‌ ప్రభుత్వ అసత్రిలో వీరంగం సృష్టించిన గుర్తుతెలియని వ్యక్తి

Medchal: మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం సాయంత్రం చాకుతో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు.

KARUNAKAR, UPPAL
Published on: 20 May 2026 7:28 AM IST
Medchal
X

Medchal: ఘట్‌ కేసర్‌ ప్రభుత్వ అసత్రిలో వీరంగం సృష్టించిన గుర్తుతెలియని వ్యక్తి

మేడ్చల్ జిల్లా: ఘట్‌కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చికిత్స కోసం వచ్చానంటూ ఆసుపత్రికి చేరుకున్న గుర్తుతెలియని వ్యక్తి అకస్మాత్తుగా ఆగ్రహంతో రెచ్చిపోయి డ్యూటీలో ఉన్న స్టాఫ్ నర్స్, ఆసుపత్రి సిబ్బంది, చికిత్స పొందుతున్న రోగులపై దాడికి దిగాడు. చేతిలో చాకు పట్టుకుని ఆసుపత్రి వార్డుల్లో హల్‌చల్ సృష్టించిన అతడు పలువురిపై దాడి చేయడంతో కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. అంతేకాకుండా ఆసుపత్రిలోని మెడికల్ సామగ్రి, ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో రోగులు, వారి బంధువులు భయంతో ఆసుపత్రి బయటకు పరుగులు తీశారు. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆ వ్యక్తి ఘట్‌కేసర్ సెంటర్‌లో కూడా ప్రజలపై దాడికి యత్నించినట్లు తెలుస్తుంది. స్థానికులు అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

సమాచారం అందుకున్న ఘట్‌కేసర్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులపైనా దాడి చేయడానికి యత్నించడంతో ఒక కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో స్థానికులు అడ్డుకునే ప్రయత్నంలో గుర్తుతెలియని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన ఘట్‌కేసర్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story