Quthbullapur: బాచుపల్లిలో సీఐటీయూ కాగడాల ప్రదర్శన: సీఈసీ రాజీనామాకు డిమాండ్!

Quthbullapur: ఎస్‌ఐఆర్ పేరిట ఓట్ల తొలగింపును నిరసిస్తూ కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కుత్బుల్లాపూర్ బాచుపల్లిలో సీఐటీయూ కాగడాల ర్యాలీ నిర్వహించింది.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 12 Oct 2026 9:50 PM IST
Quthbullapur
X

Quthbullapur: బాచుపల్లిలో సీఐటీయూ కాగడాల ప్రదర్శన: సీఈసీ రాజీనామాకు డిమాండ్!

Quthbullapur: SIR పేరుతో ఓటర్ల ఓట్ల తొలగింపును వ్యతిరేకిస్తూ, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర, రాష్ట్ర CITU కమిటీల పిలుపు మేరకు సోమవారం బాచుపల్లి మండల కేంద్రంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ప్రగతి నగర్‌లోని సుందరయ్య భవన్ నుంచి మూడు కోతుల సెంటర్ వరకు కాగడాలతో ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా CITU బాచుపల్లి మండల కన్వీనర్ రాథోడ్ సంతోష్ మాట్లాడుతూ, SIR పేరుతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఓటర్ల ఓటు హక్కును తొలగించడం రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. ఓట్ల తొలగింపు వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఈ వ్యవహారంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్‌తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాత్రపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, యువకులు, విద్యార్థి సంఘాలు, ఇండియా కూటమి నాయకులు చేస్తున్న నిరసనలపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఆయన ఖండించారు. శాంతియుత నిరసనలను అణచివేసే ప్రయత్నాలు ప్రజాస్వామ్య హక్కులకు విరుద్ధమని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలోనూ SIR పేరుతో ఓటర్ల తొలగింపు జరుగుతోందని, రాష్ట్రంలో తొలగించబడినట్లు చెబుతున్న 94 లక్షల మంది ఓటర్ల వివరాలను సమగ్రంగా పరిశీలించాలని డిమాండ్ చేశారు. ఓటు హక్కుకు అర్హులైన ప్రతి ఒక్కరికీ తిరిగి ఓటు హక్కు కల్పించాలని, అర్హులైన ఓటర్లు ఎవరూ తమ హక్కును కోల్పోకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు.

రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును, ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించేందుకు ప్రజలంతా ఐక్యంగా ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని రాథోడ్ సంతోష్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో CITU నాయకులు బాల వెంకటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, పిచ్చన్న, భాస్కర్, స్వామి, బాల పీర్, శివ, రాజేశ్వరరావు, అక్బర్, కోటేశ్వరరావుతో పాటు పలువురు నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR