Quthbullapur: ఆక్రమణల చెరలో పరికి చెరువు.. కాపాడాలంటున్న కాంగ్రెస్ నాయకులు

Quthbullapur: కుత్బుల్లాపూర్ పరికి చెరువు 77 ఎకరాల నుంచి 28 ఎకరాలకు కుచించుకుపోయిందని జగద్గిరిగుట్ట కాంగ్రెస్ నాయకుల ఆవేదన. మిగిలిన స్థలాన్ని కాపాడాలని హైడ్రాకు విజ్ఞప్తి.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 8 Nov 2026 4:05 PM IST
Quthbullapur
X

Quthbullapur: ఆక్రమణల చెరలో పరికి చెరువు.. కాపాడాలంటున్న కాంగ్రెస్ నాయకులు

కుత్బుల్లాపూర్: ఒకప్పుడు 77 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి జలకళతో కళకళలాడిన పరికి చెరువు.. నేడు ఆక్రమణల కారణంగా క్రమంగా కుచించుకుపోయింది. ఒక్కొక్కటిగా చెరువు భూములు అన్యాక్రాంతం కావడంతో విస్తీర్ణం సుమారు 28 ఎకరాలకే పరిమితమైందని జగద్గిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన చెరువు భూమినైనా పరిరక్షించి, అభివృద్ధి చేసి ప్రజలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని ప్రభుత్వాన్ని కోరారు.

ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు చేపడుతుంటే ఆక్రమణదారులకు మాత్రం నిద్ర పట్టడం లేదని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. చెరువు భూములను కాపాడటం ద్వారా భవిష్యత్తు తరాలకు విలువైన జలవనరులను అందించవచ్చని, స్థానిక ప్రజలకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.

జలవనరుల పరిరక్షణకు ప్రాధాన్యం

పరికి చెరువును ఆక్రమణల నుంచి పూర్తిగా రక్షించేందుకు హైడ్రా చేపడుతున్న చర్యలు అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు. ఆక్రమణల తొలగింపుతో పాటు చెరువు చుట్టూ కంచె ఏర్పాటు పనులను ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించాలని కోరారు.

మిగిలిన 28 ఎకరాల చెరువు స్థలాన్ని అభివృద్ధి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. చెరువుల పరిరక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, భావితరాలకు జలవనరులను అందించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన సామాజిక బాధ్యత అని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR