Quthbullapur: 43 మంది ప్రతిభావంతులకు రూ.21.50 లక్షల ప్రోత్సాహకం
Quthbullapur: కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 43 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రూ.21.50 లక్షల ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం.
Quthbullapur: 43 మంది ప్రతిభావంతులకు రూ.21.50 లక్షల ప్రోత్సాహకం
కుత్బుల్లాపూర్: పేదరికం ప్రతిభకు అడ్డుకాకూడదు.. ఆర్థిక ఇబ్బందులు విద్యార్థుల ఆశయాలకు అవరోధం కాకూడదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ప్రతికూల పరిస్థితులను అధిగమించి చదువులో రాణించిన విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తే వారి భవిష్యత్తుకు మరింత భరోసా లభిస్తుంది. ఈ ఆశయంతోనే కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించింది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి మండలం నిజాంపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. 2025-26 విద్యా సంవత్సరంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 600 మార్కులకు గాను 500, అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 43 మంది విద్యార్థులను ఈ సందర్భంగా నగదు పురస్కారాలతో సత్కరించింది.
ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున మొత్తం రూ.21 లక్షల 50 వేల నగదు బహుమతులను అందజేసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఈ. నవీన్ నికొలేస్ ( ఐఏఎస్ ) హాజరయ్యారు. కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ నరేంద్ర కుమార్ కామరాజు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించడం, వారి ఉన్నత విద్యకు ఆర్థిక భరోసా కల్పించడం, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత లక్ష్యాలను చేరుకునేలా వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి, వారి చదువుకు అండగా నిలుస్తున్న ట్రస్ట్ సేవలను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐదు ప్రాథమిక పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, పురస్కార గ్రహీతల తల్లిదండ్రులు పాల్గొన్నారు.




