Quthbullapur: ప్రతి నీటి బొట్టూ విలువైనదే: కుత్బుల్లాపూర్లో విద్యార్థుల నినాదం!
Quthbullapur: నీటి పొదుపు, ఇంకుడు గుంతల ఏర్పాటుపై కుత్బుల్లాపూర్ సూరారంలో నార్త్ సిటీ పాఠశాల విద్యార్థులు పర్యావరణ ప్రేమికుడు కోల రవీందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
Quthbullapur: ప్రతి నీటి బొట్టూ విలువైనదే: కుత్బుల్లాపూర్లో విద్యార్థుల నినాదం!
కుత్బుల్లాపూర్: భూగర్భ జలాలు అడుగంటకుండా వర్షపు నీటిని ఒడిసిపట్టాలి.. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత తప్పనిసరి చేయాలి.. నీటి సంరక్షణను ప్రజల బాధ్యతగా మార్చాలి.. ఇదే నార్త్ సిటీ పాఠశాల విద్యార్థుల నినాదం. నీటిని వృథా చేయొద్దంటూ సూరారం ఎక్స్ రోడ్డు వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించారు.
పర్యావరణ ప్రేమికుడు కోల రవీందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు నీటి పొదుపుపై నినాదాలు చేశారు. ఇంట్లో కుళాయిల నుంచి నీరు వృథాగా పోకుండా చూడాలని, స్నానం సహా రోజువారీ అవసరాల్లో పరిమితంగా నీటిని వినియోగించాలని సూచించారు. వృథా నీటిని సాధ్యమైన మేరకు ఇతర అవసరాలకు మళ్లించాలని పిలుపునిచ్చారు.
నిబంధనలతోనే నీటి సంరక్షణకు దారి వర్షపు నీటిని భూమిలోకి ఇంకించేలా ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఇంకుడు గుంతల ఏర్పాటును బోరు అనుమతులు, బ్యాంకు రుణాలు, ప్లాట్లు, ఇళ్ల రిజిస్ట్రేషన్లతో అనుసంధానించే విధంగా నిబంధనలు తీసుకురావాలని కోరారు.
బోర్లు వేసే సమయంలో నీరు వృథాగా బయటకు ప్రవహించకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. భవిష్యత్తుకు నీటి భద్రతే పునాది నీరు లేనిదే జీవనం సాధ్యం కాదని, ఇప్పటి నిర్లక్ష్యం రేపటి తరాలకు నీటి సంక్షోభంగా మారుతుందని రవీందర్ ముదిరాజ్ పేర్కొన్నారు.
ప్రతి వర్షపు బొట్టును ఒడిసిపట్టడం, నీటిని పొదుపుగా వాడటం ప్రతి ఒక్కరి దైనందిన అలవాటుగా మారాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు నీటిని సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సిఎంసి అధికారులు, పాఠశాల డ్రైవర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




